calender_icon.png 6 February, 2026 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవదుర్గం ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

06-02-2026 07:33:52 PM

గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని దేవదుర్గం గ్రామంలో ఉన్న అతి ప్రాచీన ఆలయానికి గుర్తింపు కరువైందని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. శుక్రవారం దేవదుర్గం గ్రామాన్ని సందర్శించిన ఆయన ఆలయ చరిత్రతో పాటు గ్రామ సమస్యలను స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. ఈ ఆలయం 12వ శతాబ్దానికి చెందినదిగా, గోండు రాజుల పరిపాలన కాలంలో నిర్మించబడినట్లు గ్రామస్తులు తెలిపారు.

పూర్తిగా రాతితో నిర్మించిన ఈ ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ సరైన సంరక్షణ, అభివృద్ధి లేకపోవడం వల్ల నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. ఈ సందర్భంగా ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ దేవదుర్గం గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నిత్యవసరాల కోసం ఆసిఫాబాద్‌కు వెళ్లేందుకు మూడు కిలోమీటర్లు కొండ ప్రాంతాల మధ్య నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు.

అత్యవసర ఆరోగ్య అవసరాల సమయంలో కూడా రోడ్డు లేకపోవడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు దేవదుర్గం గ్రామాన్ని సందర్శించి వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ అధికారులు ఆలయాన్ని పరిశీలించి అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.