calender_icon.png 6 February, 2026 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం సొసైటీ ఆఫీసుకు తాళం

06-02-2026 07:13:49 PM

చిలుకూరులో రైతుల ఆందోళన

కోదాడ,(చిలుకూరు): యూరియా సరఫరా సక్రమంగా జరగడం లేదంటూ ఆగ్రహించిన రైతులు శుక్రవారం ఉదయం చిలుకూరులో సిబ్బందిని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలోకి వెళ్లనీయకుండా తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. గోదాంకు కూడా తాళం వేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... రైతులకు అత్యవసరమైన యూరియా సరఫరాలో నూతనంగా ప్రవేశపెట్టిన యాప్ తో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, స్టాక్ వివరాలు కూడా సరిగా ఉండడం లేదని ఆరోపించారు.

సొంత ప్రాంతంలోని సహకార సంఘంలో కాకుండా ఎక్కడో దూరప్రాంతాల్లో ఉన్న ప్యాక్స్ లో యూరియా తీసుకోవాలంటున్నట్లుగా వారు ఆరోపిస్తున్నారు. సీఈవో చిలువేరు లక్ష్మీనారాయణను సంప్రదించగా ప్రభుత్వ సూచనల ప్రకారం జిల్లావ్యాప్తంగా రైతులు యాప్ లో యూరియా బుక్ చేసుకుంటే ఏ ప్రాంతంలోనైనా వారికి యూరియా అందుబాటులోకి వస్తుందని అన్నారు. నిబంధనల ప్రకారం పని చేస్తున్నట్లు తెలిపారు.