27 February, 2026 | 7:16 PM

ప్రజారోగ్యంపై ధ్యాసలేని సీఎం

25-02-2026 12:00 AM

అటకెక్కిన వరంగల్ హెల్త్ సిటీ పనులు 

ఫ్యూచర్ సిటీ అంటూ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం 

మాజీ మంత్రి హరీశ్‌రావు 

మహబూబాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ప్రజల ఆరోగ్యం పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి ధ్యాసలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఎంజీఎం ఆసుపత్రిని హెల్త్ సిటీగా అభివృద్ధి చేయడానికి కేసీఆర్ వరంగల్‌లో హెల్త్ సిటీని నిర్మించాలని తలచి సెంట్రల్ జైలు ఆవరణలో నిర్మాణం చేపట్టగా, మిగిలిపోయిన కొద్దిపాటి పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అంటూ, హెల్త్ సిటీని, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు.

మంగళవారం నిర్మాణంలో ఉన్న హెల్త్ సిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పనుల్లో ఏ మాత్రం పురోగతి లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఫ్యూచర్ సిటీ మీద శ్రద్ధ చూపిస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ కు మంచి పేరు వస్తుం దనే అక్కసుతోనే ఈ నిర్లక్ష్యం చేశారన్నారు. డిజైన్ల మా ర్పు పేరుతో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోవడం లేదన్నారు.

జూన్ 2న ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్తున్నారని, 2 వేల పడకల ఆసుపత్రికి 2 వేల మంది నర్సులు, 1,500 మంది డాక్ట ర్లు, వెయ్యి మంది పారామెడికల్ సిబ్బంది కావాలన్నా రు. కనీసం సిబ్బంది లేకుండా హాస్పిటల్ ఎలా ప్రారంభిస్తారు అని ప్రశ్నించారు. వెంటనే ఎక్విప్మెంట్, సిబ్బంది నియామకం పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఆసుపత్రిని ప్రారంభించాలన్నారు. లేదంటే బీఆర్‌ఎస్ పక్షాన ఇక్కడే నిరాహారదీక్షకు దిగుతామన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మందులు లేవు అని, ఎంజీఎంను తక్షణమే సమీక్షించి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల దేవాదుల ప్రాజెక్టు ఏ విధంగా దెబ్బతింటుందో ప్రజల ముందు ఉంచామన్నారు.

ఆ దెబ్బకు తెల్లారి ముఖ్యమంత్రి హడావిడిగా రివ్యూ చేసి అన్ని మోటార్లు నడపాలని ఆదేశించారన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్చి 2026 నాటికి పూర్తి చేస్తామంటే, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2027 మార్చి డెడ్‌లైన్ పెట్టారన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి 2027 డిసెంబర్‌నాటికి పూర్తిచేస్తామని మరో కొత్త డెడ్‌లైన్ పెట్టారన్నారు. కేసీఆర్ రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు బడ్జెట్లలో జర్నలిస్టుల కోసం ఒక్క రూపాయి అయినా కేటాయించిందా? అని ప్రశ్నించారు. జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాలన్నారు.

ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ను, జర్నలిస్టుల హెల్త్ స్కీం సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనవెంట మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు తక్కల్లపల్లి రవీందర్‌రావు, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, దాస్యం విజయభాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆరూరి రమేష్, నన్నపునేని నరేందర్, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.