మా సమస్యలు సీఎం పరిష్కరిస్తారు
- సమస్యలపై చర్చించేందుకు పిలుస్తారు
- ఆ విశ్వాసం మాకు ఉంది
- గత ప్రభుత్వంలో ౩ డీఏలు పెండింగ్
- 27 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
- తెలంగాణ ఉద్యోగ జేఏసీ వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యోగ జేఏసీని పిలిచి ఆర్థిక భారంలేని అంశాలన్నింటినీ వెంటనే పరిష్కరిస్తారనే విశ్వాసం తమకు ఉందని టీజేఏసీ తెలిపింది. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో కార్యాలయంలో టీజీవో, టీఎన్జీవో, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి శాంతియుతంగా తమ సమస్యల పరిష్కారం సాధించుకుంటామని తెలిపారు.
జేఏసీలో 27 సంఘాలతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సెప్టెంబర్ 1న సీపీఎస్ రద్దుకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల కలెక్టరేట్ల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన, గన్‌పార్క్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని మూడు డీఏలు కలుపుకొని ఇప్పటి వరకు మొత్తం నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ప్రియారిటీల వారీగా సమస్యలను పరిష్కరిస్తుందని, తమకు కూడా న్యాయం చేస్తుందని భావిస్తున్నామని తెలిపారు.
సీపీఎస్ తొలగిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారని, దాన్ని అమలు చేయాలని కోరారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంకు ఎమ్మెల్సీ ఇచ్చిన సందర్భంగా ఆయనకు సన్మాన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. వంద మందితో ఎగ్జిక్యూటీవ్ కమిటీ నియమిస్తామని వెల్లడించారు. త్వరలో తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. స్టీరింగ్ కమిటీలో టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయూటీఎస్, టీఎస్ యూటీఎఫ్, టీజీఆర్‌ఈఎస్‌ఏ, ఎస్టీయూటీఎస్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్, టీపీటీఎఫ్, డీటీఎఫ్, టీఆర్టీఎఫ్, టీపీటీయూ, సీపీఎస్ తదితర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు.






