11-11-2025 04:56:19 PM
లబ్ధిదారురాలు సమ్మక్కకు రూ.60,000 సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత..
చిన్నగూడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మారబోయిన వెంకటేశ్వర్లు ముదిరాజ్..
మరిపెడ/చిన్నగూడూరు (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రుల సహాయనిధి) పథకం నిజమైన ప్రజల పథకమని చిన్నగూడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మారబోయిన వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన సమ్మక్క అనే లబ్ధిదారురాలికి రూ.60,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావుల రాంరెడ్డి మార్గదర్శకత్వంలో లబ్ధిదారురాలి ఇంటికి వెళ్లి స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు ముదిరాజ్ మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాల్లో పక్కనే నిలబడటమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదల జీవితాలను మార్చే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. వైద్యానికి ఖర్చు పెట్టలేని పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి వరంగా మారింది. కేవలం పత్రాలపై కాదు, ప్రజల ఇళ్లకే వెళ్లి సహాయం అందించడం మా పార్టీ ప్రత్యేకత అని తెలిపారు.
మా ప్రభుత్వ విధానం ప్రజల మధ్యే ఉండి సేవ చేయడం. ప్రతీ అర్హుడికి ప్రభుత్వ సహాయం చేరే వరకు కృషి చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పాలనతో ప్రతి పేదరిక బాధిత కుటుంబంలో ఆనందం నిండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ ఇండ్లు, రైతు భరోసా వంటి పథకాలతో పాటు సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు నేరుగా సహాయం అందిస్తోందని చెప్పారు. ప్రజలకు అండగా నిలుస్తూ, ప్రతి లబ్ధిదారునికి సహాయం అందించే కృషి కొనసాగుతుందని వెంకటేశ్వర్లు ముదిరాజ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దొంగరి నరసయ్య, మాజీ వైస్ ఎంపీపీ పిల్లి వీరన్న, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కంచనపల్లి ఉప్పలయ్య, చాట్ల రామచంద్రు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.