7 July, 2026 | 2:02 AM

త్వరలో చింతకానిలో సీఎం బహిరంగ సభ

07-07-2026 01:08 AM

క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్, సీపీ

ఖమ్మం, జూలై 6(విజయక్రాంతి): అతి కొద్ది రోజుల్లోనే ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు అయ్యే అవకాశం ఉంది. రైతు భరోసా నిధులు విడుదల సందర్భంగా రైతు ఆశీర్వాద సభను మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం చింతకాని మండలం జగన్నాదాపురం గ్రామంలో జరగాల్సిన బహిరంగ సభ వర్షం కారణంగా వాయిదా పడింది.

ఆ బహిరంగ సభను తిరిగి ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయించినట్లు సమాచారం. అతి కొద్ది రోజులలోనే ఈ బహిరంగ సభ ఉంటుందని తెలుస్తోంది.  జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ముఖ్యమంత్రి పర్యటన కోసం అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు.  ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురం(మత్కెపల్లి) వద్ద నిర్వహించనున్న బహిరంగ సభ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డి లతో కలిసి సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహన పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకలకు అనువైన మార్గాలు, భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్, రెవెన్యూ, పోలీసు, విద్యుత్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.