7 July, 2026 | 2:48 AM

ఖమేనీ అంత్యక్రియలకు భారత్ ప్రతినిధులు

07-07-2026 02:01 AM

కృతజ్ఞతలు తెలిపిన ఇరాన్

టెహ్రాన్‌లో కొనసాగుతున్న ఖమేనీ అంతిమయాత్ర

టెహ్రాన్, జూలై 6: ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ ప్రతినిధులు ఇటీవల హాజరయ్యారు. దీంతో ఇరాన్ ప్రభుత్వం సోమవారం భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది. భారత్ చూపిన సంఘీభావం, గౌరవాన్ని ఎప్పటికీ మరువలేమని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ప్రకటించింది.

భారత్ తరఫున ప్రతినిధులు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్, బీహార్ గవర్నర్ అయిన ఈయన భారత అధికారిక బృందానికి నాయకత్వం వహించారు. ఇందులో కాంగ్రెస్ నాయకుడు, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, పీడీపీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఉన్నారు. వీరితో పాటు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ నివాళి అర్పించారు.

వీరితోపాటు భారత్‌కు చెందిన సిక్కు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు అంత్యక్రియలకు హాజరయ్యారు. గత వారం టెహ్రాన్‌లో జరిగిన ఖమేనీ అంత్యక్రియలకు భారత్ నుంచి ఒక అధికారిక ప్రతినిధి బృందం హాజరైంది. ఇరాన్ పాలకుడికి నివాళులర్పించిన భారత ప్రభుత్వం, ప్రజలకు ఇరాన్ రాయబార కార్యాలయం ‘ఎక్స్’లో ధన్యవాదాలు తెలిపింది. ఈ దుఃఖ సమయంలో ఇరాన్  ప్రజలకు అండగా నిలిచినందుకు, సానుభూతి తెలిపినందుకు, భారత్ మిత్రుత్వాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పింది.

భారత్ ప్రతినిధులు టెహ్రాన్‌కు రావడం ఇరుదేశాల మధ్య స్నేహం, అనుబంధానికి ప్రతీక అని పేర్కొంది. ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్ ప్రభుత్వం పాకిస్తాన్, రష్యా, చైనా సహా దాదాపు 100 దేశాలను ఆహ్వానించింది. ఈ అంత్యక్రియల ప్రక్రియ దాదాపు ఆరు రోజుల పాటు కొనసాగనుంది. జూలై 9న ఖమేనీ స్వస్థలమైన మషహాద్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఈ అంతిమయాత్ర ఇరాన్, ఇరాక్ దేశాల్లోని నజాఫ్, కర్బలా వంటి పలు నగరాల గుండా సాగనుంది.

ట్రంప్ చిత్రపటంపై రాళ్లు

ఖమేనీ అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్తత వ్యక్తమైంది. అంతిమయాత్రలో పాల్గొన్న వేలాది మంది ప్రజలు అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ భారీ చిత్రపటంపై రాళ్లు రువ్వారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. భారీ బ్యానర్లను ప్రదర్శించారు. ‘మేము ట్రంప్ను చంపుతాము’ అని ఇంగ్లిష్ అక్షరాలతో రాసి ఉన్న కొన్ని మీటర్ల పొడవైన భారీ బ్యానర్ అంతిమయాత్రలో అందరి దృష్టిని ఆకర్షించింది.

ముస్లింలు పవిత్ర హజ్ యాత్రలో చేసే ‘సాతానుపై రాళ్ల దాడి’ తరహాలోనే ఈ నిరసనను చేపట్టారు. తమ ప్రధాన శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై వ్యతిరేకతను చాటడానికి ఇరాన్ ప్రజలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. సాంప్రదాయకంగా ఎంతో నిశ్శబ్దంగా సాగాల్సిన అంతిమయాత్ర ఈ రాజకీయ నిరసనలతో ఒక్కసారిగా వేడెక్కింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.