23 July, 2026 | 1:50 AM

కాక్రోజ్.. దేశ ద్రోహుల పార్టీ

23-07-2026 12:18 AM
  1. నీట్ పేరుతో దేశ వ్యతిరేక కలాపాలు
  2. ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ 

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): కాక్రోజ్ పార్టీ, దానికి మద్దతు తెలుపుతున్న పార్టీలు, నాయకులు దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు వ్యతిరేకంగా బుధవారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఒకప్పుడు ఆప్ పార్టీ సోషల్ మీడియా వలంటీర్‌గా పని చేశాడని గుర్తు చేశారు. ఒకవైపు ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రభాగాన నిలబడితే, కాంగ్రెస్ మాత్రం అధికారం కోసం అరాచక కార్యక్రమాలను చేపడుతుందన్నారు.

ప్రధాని మోదీ అభివృద్ధి పాలన చూడలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలుపుతున్న నాయకులంతా దేశద్రోహులేనని ధ్వజమెత్తారు. దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్ చుగ్ గతంలో జాతీయ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టడంతో, ఆయనపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదయిందని తెలిపారు. మమతా బెనర్జీ, స్టాలిన్, అద్దంకి దయాకర్, ప్రకాష్ రాజ్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది హిందూ వ్యతిరేకులు ఏకమవుతున్నారని చెప్పారు.

నీట్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు. అంతకు ముందు పోలీసులు దిష్టి బొమ్మ దహనాన్ని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. కార్యక్రమం లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కార్ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారా యణ, ఎర్రం సుధీర్, ఇప్పకాయల కిషోర్, చింతకాయల రాజేందర్, బెల్లాల్ శశాంక్, బొబ్బిలి సువర్ణవేణుగోపాల్, న్యాలం సునీత రాజు, బంటు ప్రీతిప్రవీణ్ పాల్గొన్నారు.