23 May, 2026 | 6:54 AM

కూల్చుడు రాజకీయం

20-04-2024 12:30 AM

l రేవంత్ సర్కారు కూలుతుందంటున్న విపక్షం

l 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్

l కాంగ్రెస్ సర్కారును బీజేపీనే కూలుస్తుందని ప్రకటనలు

l బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేస్తామంటున్న రాష్ట్ర మంత్రులు

l ఎన్నికల తర్వాత రసవత్తరంగా రాష్ట్ర రాజకీయం 

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో ఏం జరుగుతుం ది.. ఎలాంటి ఫలితాలు వస్తాయనేదానిపై కన్నా.. ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఎన్నికల తరువాత ఏం జరుగుతుందనే చర్చ ఎక్కువ అవుతున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని బీఆర్‌ఎస్ నేతలు చెప్తుంటే.. బీఆర్ ఎస్ కనిపించకుండా పోతుందని కాంగ్రెస్ నేతలు సవాళ్లు విసురుతున్నారు. గురువా రం బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల తరువాత ఏం జరుగుతుందనే చర్చకు మరింత ఆజ్యం పోశాయి.

‘104 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించింది. 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతకనిస్తుందా? అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలోకి వెళితే అక్కడంతా బీజేపీ కథ నడుస్తోందని ఓ నాయకుడు నాతో వాపోయాడు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రావాలా సార్.. అంటూ సీనియర్, కీలక నేత ఒకరు నన్ను సంప్రదించాడు. ఇప్పుడే వద్దని వారించాను. కాంగ్రెస్‌లో టీం వర్క్ లేదు. స్థిరత్వం లేదు. ఉద్యమ కాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారు. లోక్‌సభ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఏ రాజకీయ గందరగోళం జరిగినా బీఆర్‌ఎస్‌కే మేలు జరుగుతుంది’ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.

పోటాపోటీగా..

నిజానికి ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితిపై కేసీఆర్ వ్యాఖ్యానించడం మొదటి సారి కాదు. మొదటి నేతకూడా కాదు. ఈ విషయంలో అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్ నేతలు చాలా రోజుల నుంచే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీలోని రాష్ట్ర కీలక నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, అరవింద్, లక్ష్మణ్ లాంటి నేతలు వేర్వేరు సందర్భాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యాఖ్యానాలు చేసినవారే. అలాగే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒకట్రెండు సార్లు సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళతారంటూ ప్రకటించారు. ఇటు ఇరు పార్టీలకు చెందిన నేతలు గడిచిన కొద్ది రోజులుగా పోటాపోటీగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై లోక్‌సభ ఎన్నికల తరువాత చూస్కో అంటూ వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు.

ఎన్నికల తరువాత ఎంటీ?

రాజకీయ సమీకరణాలన్నీ సీసాలో సారా లాగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. రాజకీయాల్లో ఏదీ సాధ్యం కాదనేది ఉండదు. అలాగే శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు కూడా ఉండరు. అవకాశం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటారు. ఎవరూ ఊహించని సంఘటనలు కూడా జరుగుతుంటాయనేది గతంలో చాలా సార్లు నిరూపితమైంది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ, అటు బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో అసలు లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి పరిస్థితి ఏమిటనేది సర్వత్రా చర్చకు దారితీసింది. నిజానికి ఇప్పటికే కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు.

ఇంకా ఎందరు వెళ్తారో తెలియని పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో మరింత నష్టం జరక్కుండా ఉండేందుకే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అనే చర్చకూడా జరుగుతున్నది. అయితే గత కొంతకాలంగా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసి పార్టీలను చీల్చి బీజేపీ సొంత ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తూ వస్తుండటంతో కేసీఆర్ వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు అత్తెసరు మెజారిటీతోనే ఏర్పాటైంది. దీంతో నిజంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చాలంటే బీజేపీకి పెద్ద కష్టమేమీ కాదు. 

కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్

ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు పదేపదే తన ప్రభుత్వం కూలిపోతుందని ప్రకటనలు చేయటంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందిస్తున్నారు. దమ్ముంటే కూలగొట్టి చూపించాలన్నట్టు సవాళ్లు విసురుతున్నారు. విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తానే ఒక అడుగు ముందుకేసి బీఆర్‌ఎస్‌లోని ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్‌లోకి లాగేసుకొనే పని మొదలుపెట్టారు. ఎప్పుడు ఏ నేత పార్టీని విడిచి కాంగ్రెస్ కండువా కప్పుకొంటారోనని బీఆర్‌ఎస్ నేతలు బిక్కుబిక్కుమనేలా పరిస్థితులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. కిందిస్థాయి నేతలు గుంపులు గుంపులుగా హస్తం గూటికి చేరుతున్నారు. 20 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని పలువురు మంత్రులు ప్రకటనలు చేశారు. 

ఈ లెక్కన లోక్‌సభ ఎన్నికల తరువాత ప్రభుత్వంలో గందరగోళం తలెత్తే పరిస్థితులు ఉత్పన్నమైనా.. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రేవంత్‌రెడ్డి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను గంపగుత్తగా తనవైపు తిప్పుకొనేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.