పదేళ్ల అభివృద్ధి వందరోజుల్లో నాశనం

20-04-2024 12:30:00 AM

l ప్రజలు బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి

l మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

l బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు

l మాజీ డిప్యూటీ సీఎం మహమూబాద్ అలీ

l నిజమాబాద్‌లో పార్టీ బహిరంగ సమావేశం

నిజామాబాద్, ఏప్రిల్19 (విజయక్రాంతి ప్రతినిధి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్ధిని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో నాశనం చేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తొలుత ఆయన మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శనివారం బీఆర్‌ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలెక్టరేట్‌లో రెండుసెట్ల నామినేషన్లను దాఖలు చేయించారు. అనంతరం నగరంలోని కలెక్టరేట్ గ్రౌండ్‌లో పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పుడు తాగునీటికి, సాగునీటికి కరువు ఏర్పడిందన్నారు.

ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నైతికపరమైన మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. నిజామాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటై  బీఆర్‌ఎస్ అభ్యర్థి గోవర్ధన్‌ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. మైనార్గీ వర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ శుష్క వాగ్దానాలను నమ్మొద్దని సూచించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారికి కష్టాలు మొదలయ్యాయన్నారు. సర్కార్ ఇటీవల ధాన్యం సేకరణ కేంద్రాలను ప్రారంభించి, రైతుల నుంచి ధాన్యం సేకరించి, చెల్లింపుల్లో మాత్రం జాప్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. రైతులు విక్రయించిన ధాన్యానికి సరైన మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, జగిత్యాల, కోరుట్ల శాసనసభ సభ్యులు సంజయ్‌కుమార్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

-బీజేపీవి మతరాజకీయాలు: బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గోవర్ధన్ 

బీజేపీ రాముడిని వాడుకుంటూ, మత రాజకీయాలు చేస్తున్నదని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గోవర్ధన్ మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి అరవింద్ పచ్చి మోసకారి అని ఆరోపించారు. ఆయన పసుపు బోర్డు తెస్తానని చెప్పి పనుపు రైతులను మోసం చేశారన్నారు. మరోసారి పసుపు రైతులతో నామినేషన్లు దాఖలు చేయించి కొత్త నాటకానికి తెరలేపారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి గడిచిన నాలుగేళ్లలో ఒక్కసారైనా జిల్లాకు రాలేదన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.