సూర్యాపేట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
సూర్యాపేట, జూన్ 19 (విజయక్రాంతి) : స్థానికజిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులకు టెకస్ట్ బుక్స్, కంప్యూటర్ ల్యాబ్ను సందర్శించి, విద్యార్థులకు అందుతున్న డిజిటల్ విద్యపై ఉపాధ్యాయులను వివరాలు అడిగారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును తెలుసుకోవడానికి కిచెన్ షెడ్ను, పాఠశాలలోని టాయిలెట్లను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం పదవ తరగతి గదిలోకి వెళ్ళిన కలెక్టర్ అక్కడ కాసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థిని, విద్యార్థులతో ముచ్చటించారు. వారి చదువుల తీరును, భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భాషా నైపుణ్యాలను పరీక్షించడానికి స్వయంగా వారి చేత తెలుగు టెకస్ట్ బుక్ చదివించారు. స్పష్టమైన ఉచ్చారణతో చదివిన విద్యార్థులను ఆయన అభినందించారు. పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని, పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ప్రధానోపాధ్యాయురాలు పద్మ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.






