28 July, 2026 | 12:57 AM

కల్పలత సూపర్ బజార్ సొసైటీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

28-07-2026 12:00 AM

 సహకార సంఘాలు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచన

హనుమకొండ: జులై 27(విజయ క్రాంతి): హనుమకొండ నగరంలోని రంగంపేట వద్ద ఉన్న కల్పలత సూపర్ బజార్ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సోమవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సూపర్ బజార్లో వినియోగదారులకు అందిస్తున్న సేవలు, సరుకుల లభ్యత, నిర్వహణ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.

అనంతరం సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ పనితీరును తనిఖీ చేసి, ఇంధన విక్రయాలు, నిర్వహణ, సిబ్బంది విధులు, రోజువారీ లావాదేవీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సూపర్ బజార్లోని టెక్స్టైల్స్ విభాగాన్ని పరిశీలించి, ముఖ్యంగా చేనేత వస్త్రాలు, చేనేత చీరలు తదితర ఉత్పత్తుల నాణ్యత, విక్రయాలు, నిల్వల వివరాలను తెలుసుకున్నారు.

చేనేత ఉత్పత్తులకు ప్రజల్లో మరింత ఆదరణ పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం అక్కడే ఉన్న ప్రభుత్వ పాఠ్యపుస్తకాల పంపిణీ కేంద్రాన్ని సందర్శించి, విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ సజావుగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా సహకార సంఘ సభ్యుల సంఖ్య, సంఘ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, ఆదాయ వ్యయాల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకొని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా సహకార సంఘాలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.ఈ తనిఖీలో జిల్లా సహకార అధికారి బి. మోహన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంధ్యారాణి, ఆడిట్ అధికారి కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు.