28 August, 2026 | 4:30 AM

మద్దూరులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

28-08-2026 12:01 AM

మద్దూర్, ఆగస్టు 27 (విజయక్రాంతి): మద్దూరు మున్సిపాలిటీ, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ప్రియాంక గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, సంక్షేమ పథకాల అమలును పరిశీలించారు. మున్సిపాలిటీలో సిబ్బంది ఖాళీలు, ఆసరా, ఒంటరి మహిళా పింఛన్ల దరఖాస్తుల నమోదు, ఆస్తిపన్ను వసూళ్ల పురోగతిని అడిగి తెలుసుకుని రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

తహసీల్దార్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ, జలసిరి, మస్టర్, చెక్డ్యామ్లు, బుష్ క్లియరెన్స్, మెటీరియల్ కాంపోనెంట్, సెల్ఫ్ వర్క్ తదితర పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం బాలికల ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ హాజరు రిజిస్టర్ పరిశీలించారు. ఆరుగురు ఉపాధ్యాయుల్లో హెచ్‌ఎంతో సహా ముగ్గురు ఒకేరోజు సెలవులో ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు.

విద్యార్థులతో మాట్లాడి చదువు, సౌకర్యాలపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి పిల్లల హాజరు, సమయపాలన, పౌష్టికాహారం వివరాలు తెలుసుకున్నారు. టీచర్ లేకపోవడంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించాలని కలెక్టర్ ప్రియాంక సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సరస్వతీ, కమిషనర్ శ్రీకాంత్, తహసీల్దార్ మహేష్, ఎంపీడీవో భార్గవ్ పాల్గొన్నారు.