28 August, 2026 | 4:27 AM

21టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత

28-08-2026 12:00 AM

పోలీసుల అదుపులో నలుగురు

నల్లగొండ, ఆగస్టు 27 (విజయక్రాంతి): అక్రమంగా నిల్వ చేసి రీ చేస్తున్న 21 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గురువారం మిర్యాలగూడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని అవంతిపురం గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆగ్రో ప్రొడక్ట్స్ రైస్ మిల్లు వద్ద అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వలున్నట్లు సమాచారం అందింది. దీంతో దాడులు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

ఈ దాడుల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి, రైస్ మిల్లుకు తరలించి పాలిష్ చేయించి ఇతర బస్తాల్లో ప్యాక్ చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించామన్నారు. 420 సంచుల్లో సుమారు 21 టన్నుల పీడీఎస్ బియ్యం గుర్తించామని, సోమ రామకృష్ణ, చిమ్మట వెంకన్న, చిమ్మట లోకేష్, సయ్యద్ నదీమ్‌లు నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులైన నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించామని ఎస్‌ఐ లక్ష్మయ్య పేర్కొన్నారు.