1 August, 2026 | 2:47 AM

జిల్లాలో కలెక్టర్ విస్తృత పర్యటన

01-08-2026 01:17 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్/వాంకిడి, జూలై 31 (విజయక్రాంతి): జిల్లాలోని వాంకిడి ,సిర్పూర్ టి ,కౌటాల మండలాలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. హరిత  విస్తృతంగా పర్యటించారు.వాంకిడి మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఒకే భవనంలో రెండు హాస్టళ్లు కొనసాగడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి బీసీ వసతి గృహాన్ని తక్షణమే అనువైన అద్దె భవనానికి తరలించాలని అధికారులను ఆదేశించారు.

వర్షపు నీరు భవనంలోకి చేరకుండా మరమ్మతులు చేపట్టాలని, విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలని సూచించారు.  ఎస్సీ, బీసీ వసతి గృహాలకు ప్రత్యేక నూతన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు.

కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత నది వరద పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్, ప్రస్తుతం నదిలో 146.65 మీటర్ల నీటి మట్టం కొనసాగుతుండగా, 7.75 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం దిగువకు వెళ్తోందని, ఎగువ ప్రాంతాల నుంచి మరో 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు నదులు, వాగులు, చెక్డ్యాంలు, వంతెనల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, వ్యవసాయ కూలీలు మెరుపులు, ఉరుముల సమయంలో పొలాల్లో పని చేయవద్దని హెచ్చరించారు.

సిర్పూర్ (టి) మండలం వెంకట్రావుపేట వద్ద ప్రాణహితపెన్గంగా వంతెనను పరిశీలించిన కలెక్టర్, ఓవర్లోడ్ వాహనాల నియంత్రణకు ఏర్పాటు చేసిన ఆర్చ్ తొలగింపుపై ఆరా తీశారు. వంతెన వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో ఇప్పటికే 90 శాతం ప్రక్రియ పూర్తయిందని, ఆగస్టు 3లోపు 100 శాతం పూర్తి చేయడానికి రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి ఏజెంట్లు సహకరించాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు.