డబుల్ బెడ్ రూంలను పరిశీలించిన కలెక్టర్
మంచిర్యాల, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లోని, బెల్లంపల్లి మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూం ఇండ్లను మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలకు గూడు కనిపించే ఉద్దేశంతో చేపట్టిన రెండు పడక గదుల పథకంలో అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్లు త్వరలోనే అందజేస్తామన్నారు. అనంతరం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి కార్యాలయ రికార్డులు, దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. వివిధ భూ సమస్యలపై భూ భారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.






