స్వీయ గణన సామాజిక బాధ్యత
ఆధారాల నమోదుపై అనుమానం వద్దు: కలెక్టర్ భవేష్ మిశ్రా
నిర్మల్, ఏప్రిల్ 2౮ (విజయక్రాంతి): భారత ప్రభుత్వ ఆదేశం మేరకు ఈనెల 26 నుంచి మే 10 వరకు జిల్లాలో జరిగే స్వీయ గణన 2027 సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వీయ గణన 2027 ప్రాధాన్యతను వివరించి మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 2011 జనాభా ప్రకారం హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ స్వీయ గణన ప్రారంభమైందని ప్రతి కుటుంబంలో యజమాని తప్పనిసరిగా ఆన్లైన్లో కుటుంబ వివరాలను నమోదు చేసుకుని సహకరించాలన్నారు. ప్రతి కుటుంబంలో యజమాని పేరు ఫోన్ నెంబరు ఇంటి వివరాలు తదితర అంశాలతో కూడిన 33 ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలో నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఈ గణన ఆధారంగానే భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు బడ్జెట్ తదితర అంశాలు ఆధారపడి ఉంటాయని తెలిపారు. గణనలు పేర్కొన్న అంశాలు గోప్యంగా ఉంటాయని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అతను కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, సిపిఓ జీవరత్నం, డిపిఆర్‌ఓ విష్ణువర్ధన్ అధికారులు ఉన్నారు.
అలాగే పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా విద్యలో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అన్నారు. పట్టణంలోని నిర్మల్ అర్బన్ కేజీబీవీ పాఠశాలలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల తో సమావేశం నిర్వహించారు. సప్లమెంటరీ పరీక్షల్లో అందరూ ఉత్తీర్ణత కావాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న, ఎస్ ఓ సుజాత, తాసిల్దార్ రాజు అధికారులు ఉన్నారు.






