calender_icon.png 28 January, 2026 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిర్వహణ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్

28-01-2026 12:00:00 AM

నిజామాబాద్, జనవరి 27(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం బోధన్ పట్టణంలోని విజయ మేరీ హైస్కూల్ లో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం బోధన్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కోసం విజయ మేరీ పాఠశాలలో అనువుగా ఉన్న ఆయా విభాగాల గదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను పరిశీలన జరిపారు.

సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఇతర అధికారులతో డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సాఫీగా జరిగేలా, అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిపోలింగ్ కు ఆస్కారం ఉండకూడదని అన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ విఠల్, సంబంధిత అధికారులు ఉన్నారు.

కస్తూర్బా బాలికల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

బోధన్ మండలం అమ్దాపూర్ లో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. విద్యార్థులకు సిద్ధం చేసిన మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక  ఆహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలు నిశితంగా పరిశీలించిన కలెక్టర్, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి వ్యక్తులు ఏ ఒక్కరిని కూడా లోనికి అనుమతించకూడదని, విద్యార్థినులను వారి తల్లిదండ్రులు వస్తేనే వారి వెంట ఇంటికి పంపాలని హితవు పలికారు.

తరచూ ఇంటికి వెళ్ళే బాలికల విషయంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, వారు పదేపదే ఎందుకు వెళ్తున్నారు అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు. ఇటీవలే బాన్సువాడ మండలం బోర్లం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కు చెందిన సంగీత అనే 8వ తరగతి విద్యార్థిని నిర్వాహకుల అజాగ్రత్త వల్ల ప్రమాదం బారిన పడి మృతి చెందిందని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, ఎంఈఓ నాగయ్య,  కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ హిమబిందు తదితరులు ఉన్నారు.