28-01-2026 04:45:38 PM
క్షతగాత్రులను స్వయంగా అంబులెన్సులో ఎక్కించిన అదనపు ఎస్పీ
మెదక్,(విజయక్రాంతి): అక్కన్నపేట గ్రామ శివారులోని అక్కన్నపేట ఫారెస్ట్ పార్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్వాపూర్ గ్రామం నుంచి పాతూర్ సంతకు వెళ్తున్న ఆటో అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమై, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అదే వాహనంలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడగా, ప్రమాదంతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఇదే సమయంలో రామాయంపేట వైపు వెళ్తున్న మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ప్రమాదాన్ని గమనించి వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను సహాయపడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఆయన తన గన్‌మన్ ప్రశాంత్, డ్రైవర్ గోవర్ధన్, కాట్రాయల్ సర్పంచ్, సహాయంతో గాయపడిన వారిని స్వయంగా అంబులెన్సులో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడే ఉండి ట్రాఫిక్ నియంత్రణ చేపట్టి వాహనాల రాకపోకలను సజావుగా నిర్వహించారు. అదనపు ఎస్పీ చూపిన మానవత్వం, సేవాభావం అక్కడున్న ప్రజలను ఆకట్టుకుంది. విధి నిర్వహణకే పరిమితం కాకుండా, ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవడం పోలీస్ శాఖ సేవాతత్వానికి నిదర్శనంగా నిలిచింది.