calender_icon.png 22 December, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి

29-07-2025 12:00:54 PM

ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో కలెక్టర్ సమావేశం

మహబూబాబాద్, (విజయక్రాంతి): వర్షాకాలం నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలకు గురికాకుండా రక్షణ చర్యల్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(Collector Adwait Kumar Singh) అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్ ల తో కలిసి ఎన్డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం) అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విపత్తు నిర్వహణ, తక్షణ చర్యలు, సహాయ కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో ప్రకృతి విపత్తులు, ముఖ్యంగా వరదలు, భూకంపాలు, తుపాన్లు వంటి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరంగా చర్చించారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, విపత్తు నిర్వహణలో మెరుగైన విధానాలను అమలు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సమన్వయం అత్యంత కీలకమని, విపత్తు సమయంలో వేగంగా స్పందించే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముందస్తు ప్రణాళికలు, అప్రమత్తతతో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు.

ఎన్డీఆర్ఎఫ్ బృందం త్వరలో జిల్లాలో విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డిఓ కృష్ణవేణి, జెడ్.పి. సీఈఓ పురుషోత్తం, డి.ఆర్.డి.ఓ మధుసూదన రాజు, జిల్లా అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ భూపేంద్ర కుమార్, ఎ.ఎస్.ఐ. ప్రదీప్ కుమార్, నరేందర్ సింగ్, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, పంచాయతీ రాజ్, మునిసిపల్, విద్యుత్, రోడ్లు-భవనాలు, తాగునీరు తదితర శాఖల అధికారులు, కలెక్టరేట్ ఎ.ఓ పవన్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు.