19 August, 2026 | 8:52 PM

త్వరలో అందుబాటులోకి వోల్టా క్యాబ్

15-06-2024 01:39 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14(విజయక్రాంతి): గ్రేటర్‌లో ఓలా, ఊబర్, ర్యాపిడో తరహాలో మొబైల్ యాప్ బేస్డ్ వోల్టా క్యాబ్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. నాలుగు నెలలుగా పైలట్ ప్రోగ్రామ్‌లు చేపడుతున్న వోల్టా యాజమాన్యం నగరంలో క్యాబ్ డ్రైవర్లతో శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుతం ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలకు అనుబంధంగా రైడ్ చేపడుతున్న డ్రైవర్లు తమకు చెల్లించే రేట్లు ఏమాత్రం సరిపోవడం లేదంటూ కొన్నా ళ్లుగా నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో వోల్టా మొబైల్ యాప్ ద్వారా వచ్చే క్యాబ్‌ల నిర్వహణలో డ్రైవర్లకు మేలు జరిగే అంశాలున్నాయని వోల్టా నిర్వాహకులు చెబుతు న్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థలు కిలోమీటరుకు .12 నుంచి 13 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాయని, క్యాబ్‌లలో ఏసీ వేస్తే మొత్తం రూ.16 ఖర్చవుతుండగా, అదనపు భారాన్ని తామే భరించాల్సి వస్తుందంటూ క్యాబ్ యాజమానులు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాకుండా, ప్రతీ రైడ్‌కు 30 శాతం కమీషన్‌ను ఆయా సంస్థలే పొందుతున్నాయని వాపోయారు. ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అన్ని సమయాల్లోనూ ఒకే రేటు ఉండేలా వోల్టా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నది.

నగరంలో ఇప్పటికే గత నాలుగు నెలలుగా 45 వేలకు పైగా డ్రైవర్లను, 30 వేలకు పైగా ప్రయాణికులను ఆన్‌బోర్డు చేసినట్టుగా తెలుస్తుంది. వోల్టా సీఈవో రాజా విక్రం నేతృత్వంలో శుక్రవారం నగరంలోని గిగ్ అండ్ ఫ్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. డ్రైవర్లకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారో వివరించారు. సమావేశంలో వోల్టా అందించే ధరలు ఆమోదయెగ్యంగా ఉన్నట్టు ప్రకటించడం పట్ల తెలంగాణ గిగ్ అండ్ ఫ్లాం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సలావుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు.