కమీష(న్)నర్ మేడలు
- పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో లీలలు
- 507 గజాల విస్తీర్ణంలోని రెండు ప్లాట్లపై.. నాలుగు సేల్‌డీడ్లు, రెండు వేర్వేరు పర్మిషన్లు
- మరో రెండు ప్లాట్లపై అనుమతులు లేకుండానే.. బహుళ అంతస్థుల్లో కలిపేసిన వైనం
- లంచం ఇస్తే మేడపై మేడ నిర్మించుకోవచ్చు
- ఇవ్వకుంటే బుల్డోజర్లు పరుగెత్తుకొస్తాయి
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 26 (విజయక్రాంతి): ‘నవ్విపోదురుగాక నాకేటి సిగు’్గ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్. ప్రభుత్వానికి నష్టం జరిగితే నాకేంటి, నా జేబులు నిండితే చాలన్నట్లుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఖజానాను దారి మళ్లిస్తున్నారు. కార్పొరేషన్ పాలకవర్గ సభ్యులు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల హడావుడిలో ఉంటే కమిషనర్‌తో పాటు మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారు లు మాత్రం అందినకాడికి దండుకొని తమ గల్లా నింపుకునే పనిలో నిమగ్నమయ్యారు.
వెరసి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అవినీతి మేడలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ మున్సిపల్ అధికారులకు లంచం ఇస్తే దర్జాగా మేడ మీద మేడ కట్టుకోవచ్చని, ఇవ్వకుంటే మాత్రం బుల్డోజర్లు పరుగెత్తుకొస్తాయని పీర్జాదిగూడ మొత్తం కోడై కూస్తున్నది. అంతేకాదు ఆ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు అతి తెలివితేటలను ఉపయోగించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుం డా, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులను కూడా బురిడీ కొట్టిస్తున్నారు. 507 గజాల విస్తీర్ణంలోని రెండు ప్లాట్లను నాలుగు ప్లాట్లుగా విభజించి నాలుగు సేల్‌డీడ్‌లు చేయించారు.
ఈ నాలుగు ప్లాట్ల లో రెండు ప్లాట్లకు మాత్రమే అనుమతులిచ్చి, మరో రెండు ప్లాట్లను వాటిలో కలిపేసి టౌన్‌ప్లానింగ్ అధికారుల కనుసన్నల్లో బహుల అంతస్థుల నిర్మాణం చేయిస్తున్నారంటే అర్ధంచేసుకోవచ్చు. ఆ కార్పొరేషన్‌లో కమీష(న్)నర్ మేడలు అడుగు అడుగున వెలుస్తున్నాయి. లంచం ఇవ్వని భవనాలను నిముషాల్లోనే నేల మట్టం చేయాలని, లేదంటే ఉద్యోగాలు మానేసి ఇంటికి వెళ్లాలని ఆ కమిషనర్ పీర్జాదిగూడ మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులకు మౌకిక ఆదేశాలు జారీ చేస్తున్నారంటే లంచం కోసం ఆ అధికారి ఎంతకు దిగజారారో అర్థం చేసుకోవచ్చును.
భరత్‌పురిలో కమీషన్ బాగోతం
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని భరత్‌పురి కాలనీ సర్వే నంబర్ 42లో ఓ వ్యక్తికి 507 గజాల విస్తీర్ణంలో రెండు ప్లాట్లు (ప్లాట్ నంబర్లు 58, 59) ఉన్నాయి. ఈ ప్లాట్లలో ఇంటి అనుమతులకోసం మున్సిపల్ అధికారులను ఆశ్రయించాడు. ఈ అనుమతులను నేను ఇప్పిస్తానంటూ ఓ కార్పొరేటర్ రంగంలోకి దిగాడు. అయితే ఇంత పెద్ద విస్తీర్ణంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వాలంటే భవనం ముందు భాగంలో 11 ఫీట్లు (మూడు మీటర్లు), మిగతా మూడు దిక్కుల్లో 6.5 పీట్ల (1.5 మీటర్లు) చొప్పున సెట్ బ్యాక్ వదిలిపెట్టాలి. 238 గజాలు దాటితే మున్సిపాలిటీకి మార్టిగేజ్ చేయాలి. ఈ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం జరిగితేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ అవుతుంది. కానీ తాము చెప్పినట్లు వింటే ఈ సమస్యలేవీ ఉండవని ఆ కార్పొరేటర్ నమ్మబలికి ఆ నిర్మాణదారుడి భవన అనుమతి బాధ్యతలను తన భుజాన వేసుకున్నాడు. ఇంకేముంది కార్పొరేటర్, కమిషనర్ ఒక్కటై అవినీతి మేడ కథ నడిపిస్తున్నారు.
పథకం ప్రకారం..
507 గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు ప్లాట్లను నాలుగు ప్లాట్లుగా విభజించి ప్లాట్ నంబర్ 58, 59లో స్థలాన్ని 237 గజాలు ఒక ప్లాటుగా, అలాగే మరో 16 గజాలు ఒక ప్లాటుగా సౌజన్య కొండ పేర రిజిస్ట్రేషన్ (సేల్ డీడ్ నంబర్ 3597/2023) చేశారు. అలాగే మరో 237 గజాలు ఒక ప్లాటుగా, ఇంకో 17 గజాలు ఒక ప్లాటుగా అర్చన కొండ పేర రిజిస్ట్రేషన్ (సేల్‌డీడ్ నంబర్ 3596/2023) చేశారు. సౌజన్య కొండ పేరుతో ఉన్న 237 గజాల ప్లాటుకు 2023 సెప్టెంబర్ 26న అనుమతులు (పర్మిషన్ నంబర్ 316708/పీఈఆర్‌జడ్/0846/2023) తీసుకున్నారు. అలాగే కొండ అర్చన పేరుతో ఉన్న 237 గజాలకు 2023 సెప్టెంబర్ 26న అనుమతులు (పర్మిషన్ నంబర్ 316715/పీఈఆర్‌జడ్/0848/2023) తీసుకున్నారు. ఈ రెండు భవంతులకు కూడా స్టిల్ట్ (పార్కింగ్), ప్లస్ ౨ అంతస్థుల రెసిడెన్షియల్ ఇంటి నిర్మాణం కోసం పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ అనుమతులు జారీ చేశారు.
కానీ ముందే కమిట్ అయిన కప్పం అందడంతో ఆ కార్పొరేటర్, కమిషనర్ సూచనల మేరకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మిగిలిన రెండు ప్లాట్ల (సౌజన్య కొండ 16 గజాలు ఒక ప్లాటును, అర్చనా కొండ 17 గజాల ప్లాటు)ను కలిపేసుకొని కనీసం సెట్‌బ్యాక్ కూడా వదలకుండ మొత్తం 507 గజాల విస్తీర్ణంలో బహుల అంతస్థుల భవనాన్ని దర్జాగా నిర్మిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని తెలిసినా టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆ వైపు వెల్లవద్దంటూ సాక్షాత్తు కమిషనర్, ఆ కార్పొరేటర్ ఉత్తర్వులు జారీ చేశాడంటే నిర్మాణదారులతో వాళ్ల బంధం ఎంత బలంగా ఉన్నదో అర్ధంచేసుకోవచ్చు. ఈ నిర్మాణంపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
బఫర్ జోన్‌లో భారీ భవనం
పీర్జాదిగూడ సర్వే నంబర్ 74, 75 సర్వే నంబర్లు పీర్జాదిగూడ పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఈ సర్వే నంబర్‌ను 74/ఏ/సీగా నమోదు చేసి కలెక్టర్ నుంచి ఎన్వోసీ తీసుకొని సుమారు 500 గజాల పైచిలుకు చెరువు బఫర్‌జోన్ స్థలంలో బహుల అంతస్థుల అపార్టమెంట్ నిర్మాణం జరుగుతున్నది. ఇందులోనూ మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు పెద్ద మొత్తంలో దండుకొని నిర్మాణదారుడికి ఎన్వోసీ జారీ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్మాణంపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. స్పందించిన జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే ఆ నిర్మాణాన్ని ఆపాలని పీర్జాదిగూడ కమిషనర్‌కు జీహెచ్‌ఎంసీ లేఖ రాసినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
చెంగిచర్ల చౌరాస్తాలో..
వరంగల్ జాతీయ రహదారి పక్కనే చెంగిచెర్ల చౌరస్తాలో ఓ నిర్మాణదారుడు స్టిల్ట్ (పార్కింగ్), రెండు అంతస్థుల వరకు అనుమతులు తీసుకున్నాడు. కానీ స్టిల్ట్‌ను కమర్షియల్‌గా మార్చి రెండు అంతస్థులకు మాత్రమే అనుమతి పొంది ఏకంగా ఐదు అంతస్థుల భవనంను నిర్మించాడు. ఇటీవల రోడ్డు పక్కన ఓ తడకల షెడ్డును వేసుకుంటేనే బుల్డోజర్లతో వచ్చి కూలగొట్టిన పీర్జాదిగూడ మున్సిపల్ కాన్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఈ ఐదంతస్థుల భవనం జోలికి మాత్రం వెల్లడం లేదు. ఈ అవినీతి మేడలోనూ ఓ కార్పొరేటర్‌తో కమిషర్, టౌన్ ప్లానింగ్ అధికారులు చేతులు కలపడమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పదించి పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్‌తో పాటు టౌన్‌ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని పీర్జాదిగూడ ప్రజలు కోరుతున్నారు.
నా దృష్టికి రాలేదు
భరత్‌పురి కాలనీ అక్రమ నిర్మాణం నా దృష్టికి రాలేదు. గురువారం ఉద యం అనుమతులను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసు కుంటాం. ప్రభుత్వ నిబంధనలకు లోబడి అనుమతులను జారీ చేస్తున్నాము. నిబంధనలు అతిక్రమించిన భవనాలపై చర్యలు తప్పవు.
త్రిళేశ్వర్‌రావు, కమిషనర్,
పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్






