26 July, 2026 | 4:07 AM

డిగ్రీకి తగ్గుతున్న క్రేజ్!

27-06-2024 04:06 AM
  • 4 లక్షల్లో సగం వరకు ఖాళీనే

ఇంజినీరింగ్‌కు ఎక్కువ మంది మొగ్గు

ఈ ఏడాది ఇప్పటివరకు నిండినవి 1.17 లక్షల సీట్లే

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): డిగ్రీకి ఆదరణ తగ్గుతోంది. కేటాయింపుల్లో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. సంప్రదాయ కోర్సులవైపు విద్యార్థులు మొగ్గు చూపడంలేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న కోర్సులనే విద్యార్థులు ఎంచుకోవడంతో డిగ్రీకి ఆదరణ కరువవుతోంది. ఏటా దాదాపు సగం సీట్ల వరకు భర్తీ కావడంలేదు. కాస్తో కూస్తో కామర్స్ సీట్లు నిండుతున్నా మిగిలిన ఆర్ట్స్, లైఫ్‌సైన్స్, ఫిజికల్ సైన్స్ కోర్సులు అరకొరగానే భర్తీ అవుతున్నాయి.

4.49 లక్షల్లో 1.17 సీట్లే భర్తీ..

రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ కాలేజీలన్నీ కలిపి 1,066 వరకు ఉన్నాయి. వీటిలో 135 ప్రభుత్వ, 86 రెసిడెన్షియల్ కాలేజీలుకాగా, మిగతావి ప్రైవేట్ కాలేజీలు. ఈ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటికే దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) ద్వారా డిగ్రీ సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 7న కేటాయించిన మొదటి విడుతలో 76,290 సీట్లు భర్తీ కాగా, ఈనెల 18న కేటాయించిన రెండో విడుత సీట్లలో 41,533 సీట్లు భర్తీ అయ్యాయి. అంటే మొత్తం 4,49,449 సీట్లకు గానూ ఇప్పటివరకు 1,17,823 సీట్లు భర్తీకాగా, ఇంకా 3,31,626 సీట్లు మిగిలాయి. రెండు విడుతలు ముగిసేనాటికి సగం సీట్లు కూడా నిండలేదు.

ఇంజినీరింగ్ వైపు మొగ్గు

ఇంటర్ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర టెక్నికల్ కోర్సుల వైపు వెళ్లిపోతున్నారు. ఇంటర్ సెకండియర్‌లో ఈసారి 5,02,280 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరైతే అందులో 3,22,432 మంది విద్యార్థులు పాస్ కాగా, సప్లిమెంటరీ రాసి మరో 60,615 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే మొత్తం 3,83,047 మంది ఉన్నారు. వీరిలో దాదాపు 2 లక్షల మంది మాత్రమే డిగ్రీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.

మిగిలిన వారు ఇంజినీరింగ్, ఇతర కోర్సులవైపు మొగ్గు చూపుతున్నారు. గతేడాది 3,89,049 సీట్లకు 2.05 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని అధికారులు తెలిపారు. మొదటి, రెండు విడుతల్లో మిగిలిన 3,31,626 సీట్లకు మూడో విడుతలో భర్తీ చేయనున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 2 వరకు కొనసాగనుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లను స్వీకరిస్తున్నారు. జూలై 6న మూడో విడుత సీట్లను విద్యార్థులకు కేటాయిస్తారు. వచ్చే నెల 15 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి.