వైద్యుల భద్రతపై కమిటీ
దవాఖానల్లో వైద్య సిబ్బంది భద్రతకు సూచనలు
కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన
సమ్మె విరమించాలని వైద్యులకు వినతి
దేశవ్యాప్తంగ వైద్యుల విధుల బహిష్కరణ
నిలిచిపోయిన సాధారణ సేవలు
న్యూఢిల్లీ, ఆగస్టు 17: కోల్‌కతాలోని ఆర్జీ కర్ దవాఖానలో ఓ వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది సమ్మె కొనసాగుతున్నది. మరోవైపు దవాఖానల్లో వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు తగిన సూచనలు చేసేందుకు నిపుణుల కమిటీని నియమిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది.
వైద్యుల భద్రతకు హామీ
పని ప్రదేశాల్లో వైద్య సిబ్బంది భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటామని కేంద్ర వైద్యశాఖ హామీ ఇచ్చింది. నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఈ అంశానికి సంబంధించిన అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి తగిన సూచనలు చేస్తుందని తెలిపింది. సమ్మె చేస్తున్న ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ), రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ ఇన్ ఢిల్లీ ప్రతినిధులతో ఆరోగ్యశాఖ అధికారులు శనివారం చర్చలు జరిపారు. వైద్యుల సమ్మెతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.
సామూహిక అత్యాచారం జరుగలేదు
కోల్‌కతా వైద్యురాలి హత్యపై బెంగాల్ పోలీసులు పలు విషయాలు వెళ్లడించారు. ఈ కేసుపై నిజంకంటే అబద్ధాలే అధకంగా ప్రచారం అవుతున్నాయని అసహనం వ్యక్తంచేశారు. మీడియాలో ప్రచారం అవుతున్నట్టు మృతురాలి శరీరంలో ఎక్కడా ఎముకలు విరుగలేదని తెలిపారు. ఆమెపై సామూహిక లైంగికదాడి జరిగిందని, మృతురాలి శరీరంలో 150 గ్రాముల వీర్యం బయటపడిందన్న వార్తలను పోలీసులు ఖండిచారు. అవన్నీ తప్పుడు వార్తలని కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినేశ్ గోయల్ కొట్టిపారేశారు.
ఢాకా విద్యార్థుల సంఘీభావం
కోల్‌కతా వైద్యురాలి హత్యను బంగ్లాదేశ్‌లోని ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా భారత్‌లో వైద్యులు చేపట్టిన ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. భారత వైద్యుల పోరాటానికి మద్దతుగా ఢాకా యూనివర్సిటీలో శనివారం ర్యాలీ నిర్వహించారు.






