త్వరలో కేసీఆర్‌కు నోటీసులు!
కాళేశ్వరంపై అధికారుల వంతు ముగిసింది
నెలాఖరుతో ముగియనున్న పీసీ ఘోష్ కమిషన్ గడువు
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమా లపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కీలకమైన నిర్ణయాలకు సిద్ధమైంది. ప్రాజెక్టు అక్ర మాలకు సంబంధించి ఇప్పటివరకు ఇంజనీరింగ్ అధికారులు, కేంద్ర సంస్థల అధికారులు, సాగునీటి నిపుణులను విచారించగా, ఇప్పుడు గత ప్రభుత్వ పెద్దలపై దృష్టి సారించేందుకు సిద్ధమైందని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ అన్నీ తానై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు.
క్రమం తప్పకుండా ఇంజనీర్లు, రిటైర్ట్ ఇంజనీర్లు, నిపుణులతో సమావేశాలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ వింతగా ఆయన అభివర్ణించారు. అప్పుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి కూడా ఆయనే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ నెలాఖరుతో పీసీ ఘోష్ పదవీకాలం ముగియనున్నది. అయితే విచారణ నివేదిక అందించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
వాస్తవానికి ఘోష్ కమిషన్ గడువు జూన్ 30తో ముగిసింది. అయితే మరో రెండునెలల పాటు కమిషన్ గడువును పొడిగిస్తూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలాఖరుతో గడువు ముగియనున్న నేపథ్యంలో త్వరలోనే కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారని సమాచారం. మరోవైపు జలవనరుల సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ శనివారం నాడు విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయన కొంత సమాచారాన్ని కమిషన్‌కు తెలియచేసినట్లు సమాచారం.
అలాగే ఇప్పటికే అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్ల అధారంగా తదుపరి విచారణకు జరిపేందుకు పీసీ ఘోష్ కమిషన్ సిద్ధమైంది. అయితే ఓ మాజీ సీఎస్ మినహా మిగతా విచారణకు హాజరైన వారందరూ కమిషన్‌కు తమ వాదనలను అఫిడవిట్ల రూపంలో సమర్పించారు. అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను కమిషన్ అవసరమైన మేర మరోసారి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. క్రాస్ ఎగ్జామినేషన్ చేసి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు తిరిగి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. సాంకేతిక అంశాలపై కసరత్తు దాదాపు పూర్తి చేసిన కమిషన్ ఇక ఆర్థిక అంశాలపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం.






