26-07-2025 01:06:38 AM
నివేదిక ఆధారంగానే ఫీజులు
హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): ఇంజినీరింగ్‌తోపాటు, ఇతర వృత్తి విద్యా కాలేజీల్లోని కోర్సుల ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి కమిటీ చైర్మన్‌గా మరో ఎనిమిది మందిని సభ్యులుగా నియమించింది. 2025 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించి టీఏఎఫ్‌ఆర్‌సీ (తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ) ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడంతో కొన్ని కాలేజీల్లో ఫీజులు అసాధారణంగా పెరిగాయని భావించిన ప్రభుత్వం..
ఆ ఫీజులకు ఆమోదం తెలుపలేదు. కొత్త ఫీజులను ఖరారు చేసే ముందు ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల ఫీజులపై అధ్యయనం చేయనుంది. ఈక్రమంలోనే శుక్రవారం తాజాగా కమిటీని ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సుప్రీం కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఫీజులను ఖరారు చేసే అవకాశముంది. ఈ కమిటీ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.
దీని ఆధారంగానే ప్రభుత్వం బ్లాక్ పీరియడ్‌కు ఫీజులను ఖరారు చేయనుంది. అప్పుడే కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. అయితే అంతవరకు ఈ విద్యాసంవత్సరానికి పాత ఫీజులే అమలవుతాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ కమిటీలో సభ్యులుగా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఏ శ్రీదేవసేన, ఎస్సీడీడీ కమిషనర్/డైరెక్టర్ ఎన్ క్షితిజ, స్టేట్ ఆడిట్ డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్‌రావు, డీటీసీపీ డైరెక్టర్ ఎస్ దేవేందర్ రెడ్డి కాగా, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొ శ్రీరామ్ వెంకటేశ్ మెంబర్ సెక్రటరీగా, సభ్యులుగా జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే వెంకటేశ్వరరావు, ఉస్మానియా వర్సిటీ ఇంజినీరింగ్ విభాగం డీన్ ప్రొఫెసర్ ఏ క్రిష్ణయ్యలను సభ్యులుగా నియమించారు.