calender_icon.png 28 July, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంచంలో విషం

28-07-2025 01:34:10 AM

-గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు

-ఆసుపత్రుల పాలవుతున్న విద్యార్థులు

-ఇంత జరుగుతున్నా తనిఖీలు చేయని అధికారులు

-హక్కు’ ఇన్షియేటివ్ అధ్యయనంలో విస్తుపోయే నిజాలు

-పిల్లల ఆహారంపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలంటున్న నిపుణులు

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): రాష్ట్రంలోని గురుకులాలు, సాంఘిక సంక్షే మ పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక మూలన సర్కారు రెసిడెన్షియల్ బాలబాలికలు అస్వస్థతకు గురయ్యారనే వార్తలు సాధారణమైపోయాయి.

కాంట్రాక్టర్ల నిర్ల క్ష్యం, అధికారుల అలసత్వం వెరసి విద్యార్థులకు శాపంగా మారింది. ఇంత జరుగుతు న్నా సర్కారు మొద్దునిద్ర వీడట్లేదంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అయినా ఈ  తరహా ఘటనలు మాత్రం ఆగడం లేదు. దీంతో తమ పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దని తల్లిద్రండులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పేద విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టి లో పెట్టుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజాసం ఘాలు, విద్యార్థి సంఘాలు సూచిస్తున్నాయి. 

పల్లె.. పట్నం తేడా లేదు..

ఫుడ్ పాయిజన్ ఘటనలు ఏదో మారుమూల అటవీ ప్రాంతాల్లో జరుగుతున్నా యని అనుకుంటే పొరపాటే. నగరాల్లోనూ ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నా యి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కస్తూర్బాల నుంచి మొదలుకుని పట్టణాల్లో ఉన్న అర్బన్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలల వరకూ ఇదే తంతూ. ఎక్కడ చూసినా విద్యార్థులు దవాఖానాల పాలవడం మాత్రం పక్కా.  ‘హక్కు’ ఇన్షియేటివ్ వెల్లడించిన వివరాలు షాక్‌కు గురిచేసేలా ఉన్నాయి. 2022 జనవరి నెలల మధ్యలో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఉన్న 34 విద్యాలయాల్లో 1,247 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్‌తో అస్వస్థతకు లోనయ్యారు. 2024లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఏకంగా 386 మంది ఆసుపత్రుల పాలుకాగా.. కొందరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆ సంస్థ పేర్కొంది. 

మోగుతున్న ప్రమాద ఘంటికలు..

ఈ తరహా ఘటనలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా కానీ నష్టనివారణ చర్యలు పెద్దఎత్తున చేపట్టినట్టు కనిపించట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్క 2024లోనే రాష్ట్రవ్యాప్తంగా 36 ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగి వేయికి పైచిలుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

అందులో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీకి చెందిన 114 మంది విద్యార్థులు (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐస్), కేజీబీవీలకు చెందిన 168 మంది, గిరిజన గురుకులాలకు చెందిన 49 మంది విద్యార్థులు, మధ్యాహ్న భోజనం తిన్న 55 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు రికార్డులు చెబుతున్నాయి. ఏప్రిల్ 2024లో భువనగిరిలో ఆరో తరగతి విద్యార్థి ఫుడ్ పాయిజనింగ్ వల్ల ప్రాణాలు కోల్పోయాడు. వాంకిడి, నారాయణపేటలో పలువురు విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు.

పాపం పసిమొగ్గలు..

ఈ నిర్లక్ష్య ధోరణుల వల్ల అమాయక విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. కేవలం ఆరోగ్య సమస్యలు మాత్రమే కాకుండా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత విద్యార్థులకు మానసిక సమస్యలు కూడా మొదలవుతున్నట్టు తెలుస్తోంది. ఇటువంటి తరహా ఘటనలు జరగకుండా ఆహార భద్రత గురించి ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. అధునాతన సౌకర్యాలతో కిచెన్స్ నిర్మించి, అన్ని వసతులు కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అధునాతన కిచెన్‌లు నిర్మించడంతో పాటు పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య ధోరణిని వీడితేనే గురుకులాల్లో ఈ తరహా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగకుండా ఉంటాయని అంటున్నారు. 

పునరావృతం కాకుండా చూడాలి.. 

ఇదేదో రాజకీయ సమస్యలా కాకుండా.. అధికారులు, నాయకులు మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యకు గల అసలు కారణాన్ని వెంటనే తెలుసుకోవాలి. కారణాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అప్పుడే అమాయక విద్యార్థులు దవాఖాన్ల గడప తొక్కకుండా చేయొచ్చు.

కారణాలివేనా? 

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ విద్యాలయాల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు అనేక కారణాలున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. 

-ఈ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు అపరిశుభ్ర వాతావరణం ప్రధాన కారణం అని చెబుతున్నారు. 

-సరైన వెలుతురు లేని ప్రదేశాల్లో వంటలు చేయడంతో పాటు నిర్లక్ష్య ధోరణి.

-పాడుబడిన భవనాల్లో కిచెన్‌ల నిర్వహణ.

-సదుపాయాల లేమి.

-ఎవరికీ పట్టింపు లేకపోవడం.

-వార్డెన్‌లు, ప్రధానోపాధ్యాయులు అసలు కిచెన్‌ల వైపే చూడకపోవడం.

-అక్కడ పని చేస్తున్న వ్యక్తులకు సరైన ట్రైనింగ్ లేకపోవడం. 

-తక్కువ మందితో కిచెన్‌లు నిర్వహించడం.