28-07-2025 01:30:22 AM
‘ఎస్‌హెచ్‌జీ’లకు ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు
-2,500 యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు
-సెర్ప్ ఆధ్వర్యంలో ఆర్థిక సహకారం
-రెండేళ్లలో నిర్మించేలా ప్రణాళికలు
-ప్రతిపాదనలకు మంత్రి సీతక్క ఆమోదం
-త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం కూడా
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే మహి ళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వారు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తోంది. పారిశ్రామిక రంగంలో రాణిం చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఆ దిశగా చర్యలు కూడా చేపట్టింది. ఇప్పటికే మహిళలకు పారిశ్రామికవాడల్లో 10 శాతం ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు మహిళా సంఘాల్లోని మహిళలకు ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఎస్‌హెచ్‌జీల ఆధ్వర్యంలో పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్న ట్టు తెలుస్తోంది.
రాష్ర్టంలోని మహిళా సంఘాల సభ్యులకు 2,500 అగ్రిప్రాసెస్ యూనిట్లు నెలకొల్పేందుకు ఇప్ప టికే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) ప్రణాళికలు రూపొందించింది. యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న మహిళల నుంచి కూడా దరఖాస్తులను త్వరలోనే స్వీకరించనున్నట్లు సమాచారం. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవారికి సెర్ప్ ఆధ్వర్యంలో ఆర్థిక ప్రోత్సాహం కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వేయనున్నట్లు సమాచారం. అయితే ఒక్కో యూనిట్‌కు రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేసినట్లు తెలుస్తోంది.
గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటు
ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ర్టంలోని నిజామాబాద్‌లో పసుపు, సంగారెడ్డిలో పత్తి, చెరుకు, రంగారెడ్డిలో వరి, కూరగాయలు, మహబూబ్‌నగర్‌లో వేరుశనగ (పల్లి) సాగు, ఖమ్మంలో పత్తి, మొక్కజొన్న సాగు, భద్రాద్రి పత్తి, వరి, మొక్కజొన్న, ఆయిల్ ఫాం, ఆదిలాబాద్‌లో పత్తి, సోయ, వరంగల్‌లో వరి, నల్లగొండ జిల్లాలో వరి వంటి పంటలకు అనుగుణంగా ఆగ్రో ప్రాసెస్ యూనిట్లును నెలకొల్పనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ యూనిట్లు విజయవంతమైతే రాష్ర్టవ్యాప్తంగా యూనిట్లను విస్తరించనున్నారు.
ఈ యూనిట్లను వ్యవసాయ ఉత్పత్తులు సమృద్ధిగా లభించే ప్రాంతాలతోపాటు మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) బలంగా ఉన్నచోట ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అంతేగాకుండా మార్కెట్ సదుపాయం కల్పించేందుకు సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. మొక్కజొన్న, చిరుధాన్యాలు, కందులు, అరటి, టమాటా, మామిడి, చీనీ, ఉల్లి, మిర్చి, పసుపు తదితర పంటల దిగుబడి, అవసరమైన ప్రాసెసింగ్ ప్లాంట్లపై ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం సైతం సిద్ధం చేసినట్టు సమాచారం.
మహిళలు ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణతోపాటు ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ తదితర కార్యకలాపాలు నిర్వహించనున్నారు. స్థానికంగా లభించే పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు వంటి ఉత్పత్తులను ప్రాసెస్ చేసి వాటిని మార్కెట్‌కు తరలించనున్నారు.
ఇక్రిశాట్ ద్వారా సాంకేతిక సహకారం
మహిళలకు యూనిట్ల ఏర్పాటుకు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని ఇక్రిశాట్ నుంచి తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఆధునిక ప్రాసెసింగ్ టెక్నాలజీ, నాణ్యత నియంత్రణ, ఉత్పత్తులు తదితర అంశాలపై ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు సమాచారం. నాణ్యతా ప్రమాణాలు, ఉత్పత్తి విధానాలపై సాంకేతిక సహకారం అందించనున్నారు. మహిళా ఉత్పత్తులను మార్కెట్లతో అనుసంధానం చేయనున్నారు. వారి ఉత్పత్తులను స్థానికంగా విక్రయించడంతోపాటు ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వివిధ మార్కెట్లకు తరలించే అవకాశం కల్పించనున్నారు.
ఈ యూనిట్ల ఏర్పాటుతో వేలాది మంది మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అయితే సెర్ప్ ప్రతిపాదించిన ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతిపాదనలకు మంత్రి సీతక్క ఆమోదం ముద్ర వేశారు. అందుకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. అధికారులకు సైతం పరిశ్రమలపై దిశానిర్దేశం చేశారు. అయితే సీతక్క ఆమోదించిన ఫైల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం కోసం పంపించినట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అనుమతులు రాబోతున్నాయని తెలుస్తోంది. ఈ యూనిట్ల ఏర్పాటుతో మహిళల ఆర్థిక స్వావలంబనతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది.