16 May, 2026 | 2:49 AM

చెక్‌డ్యాం సమస్యపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు

17-05-2026 12:00 AM

ఘట్ కేసర్, మే 15 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని యంనంపేట్ లోని చెక్ డ్యాం సమస్యపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు సహదేవ్ గౌడ్, పోలగోని లక్ష్మణ్ గౌడ్ శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను అలాగే ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాస్ ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సమస్యకు సంబంధించిన ఫిర్యాదును వారికి అందజేశారు. బొంతకుంట వాగులోని చెక్ డ్యామ్ ప్రాంతంలో కొందరు రియల్టర్లు అక్రమంగా మట్టిని పోస్తూ వాగు సహజ ప్రవాహాన్ని దెబ్బతీస్తున్న విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లాము.

ఈ అక్రమ చర్యల వల్ల వర్షాకాలంలో సమీప కాలనీలకు వరద ముప్పు ఏర్పడే అవకాశముండటంతో పాటు చెక్ డ్యామ్ భద్రత కూడా ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంటుందని వివరించాము. అదేవిధంగా, చెక్ డ్యామ్ పరిధిలో అక్రమంగా మట్టిని పోస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని, వాగు సహజ ప్రవాహాన్ని పరిరక్షించాలని హైడ్రా కమిషనర్ ని, ఇరిగేషన్ ఎస్‌ఈ ని కోరడం జరిగింది. ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.