కాయితి తండా సర్పంచ్‌పై ఎంపీడీవోకు ఫిర్యాదు
గాంధారి, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కాయితీ తండా గ్రామ సర్పంచ్ జర్ప్ల నాజీ వ్యవహార శైలిపై ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఎంపీడీవో రాజేశ్వర్ కు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సర్పంచ్ తండా అభివృద్ధిని గాలికి వదిలేసినట్లు వారు వాపోయారు. ఒక నియంత లాగా వ్యవహరిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తూ తమకి నచ్చినట్టుగా వ్యవహరిస్తూ, ఉప సర్పంచ్ , వార్డు సభ్యులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎలాంటి సమావేశం నిర్వహించడం లేదని, అసలు అభివృద్ధి పనుల ఊసే లేదని వారు వాపోయారు.
పాలకవర్గం సమావేశం నిర్వహించకుండా పాలసవర్గానికి ఎలాంటి సమాచారం లేకుండా ప్రభుత్వం విడుదల చేసిన నిధుల కొరకు సంతకాలు చేయాలని ఉప సర్పంచ్ వెంకట్రామ్ పై ఒత్తిడి చేస్తున్నారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ స్థానంలో ఆమె కుమారులు గ్రామపంచాయతీ వ్యవహారాల్లో ప్రత్యేక్షంగా కలుగచేసుకుని తండా వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వేసవి దృష్ట్యా తండాలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉండడంతో ట్యాంకర్ ల ద్వారా నీటి సరఫరాను అడ్డుకుని తండా వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఎంపీడీవో తో మొర పెట్టుకున్నారు.
చెత్త ట్రాక్టర్, ట్యాంకర్ లను తమ ఇంటి వద్దే ఉంచాలని సర్పంచ్ కుమారులు గ్రామపంచాయతీ సిబ్బంది తో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు పిర్యాదులో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకట్రామ్, వార్డ్ సభ్యులు కృష్ణ, సుత్లా,అనిల్, సంగు, పరోషన్, సునీత,భాస్కర్, గ్రామపంచాయతీ సిబ్బంది విఠల్,గాంధీ పాల్గొన్నారు..






