డీఎంహెచ్‌ఓపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు
హనుమకొండ, జూలై 1 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నెలకొన్న పరిస్థితులపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ఫోన్లో మాట్లాడి, హనుమకొండ జిల్లా డీఎంహెచ్‌ఓ వ్యవహారంపై తగిన విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
బుధవారం బాలసముద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య తో కలిసి టీఎన్జీఓస్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ నాయకత్వంలో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.
డీఎంహెచ్‌ఓ వ్యవహార శైలి కారణంగా వైద్య ఆరోగ్యశాఖ లోని ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని వారు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు పరస్పర గౌరవం, సానుకూల వాతావరణంలో విధులు నిర్వహించే పరిస్థితులు ఉండాలన్నారు.
ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధిగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని, అవసరమైన ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్ మోహన్ రావు, ప్రభుత్వ వైద్యుల సంఘం (జీడీఏ) రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కృష్ణా కృష్ణారావు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ రాజిరెడ్డి, ఏఓ కోలా రాజేష్, సిహెచ్‌ఓ రాష్ట్ర అధ్యక్షులు నెహ్రు చందు, యాదా నాయక్, సుధాకర్, టీఎన్జీఓ, టీజీఓ, ప్రభుత్వ వైద్యుల సంఘం (జీడీఏ), ఆరోగ్యశాఖ ఎస్సీ, ఎస్టీ సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు.






