11 June, 2026 | 2:27 AM

ప్యాకేజీ చెల్లింపులన్నింటినీ పూర్తి చేయండి

11-06-2026 01:33 AM

కమిషనర్ కె .శివకుమార్ నాయుడు 

మహబూబ్ నగర్, జూన్ 10 (విజయక్రాంతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలన్నింటినీ పరిష్కరించి, రాబోయే 2 నెలల్లోగా పెండింగ్ పరిహార ప్యాకేజీ చెల్లింపులన్నింటినీ పూర్తి చేయాలని భూ సేకరణ పునరావాసం, పునర్నిర్మాణం కమిషనర్ కె .శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉదండాపూర్, కోయిల్సాగర్, కల్వకుర్తి, రాజీవ్ భీమా ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, ఇరిగేషన్, ల్యాండ్ సర్వే, విద్యుత్, ఆర్‌అండ్బీ, మిషన్ భగీరథ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశంలో ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రగతి, ప్రతిపాదిత లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ అనుసంధాన టన్నెల్ భూసేకరణపై కమిషనర్ ఆరా తీశారు.

ఈ ప్రాజెక్టు వల్ల ఉదండాపూర్, వల్లూర్ గ్రామాలతో పాటు రేగడిపట్టి, చిన్నగుట్ట, తుమ్మలకుంట, శ్యామగడ్డ, ఒంటిగుడిసె, పోలేపల్లి అనే 6 తండాలు ముంపునకు గురవుతున్నట్లు రెవెన్యూ అధికారులు నివేదించారు. 1,890 మంది నిర్వాసితుల ఖాతాల్లో నిధులు జమ చేశామని,మిగిలిన అర్గులైన వారికి అవార్డ్ పాస్ చేసి త్వరలో పరిహారం అందచేస్తామని  ఆర్‌అండ్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులకు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియ, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్ రెడ్డి, ఆర్.డి.ఓ నవీన్, భూ సర్వే రికార్డుల శాఖ ఎ.డి అశోక్, పంచాయతీ రాజ్ ఈ.ఈ శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్, మిషన్ భగీరథ, జడ్చర్ల తహసీల్దార్, ఇతర సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.