3 May, 2026 | 2:23 AM

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

03-05-2026 12:00 AM
  1. కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి
  2. కాన్హా శాంతివనంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక వేడుకలు

షాద్‌నగర్, మే 2 (విజయక్రాంతి): ఆధునిక జీవనశైలిలో తలెత్తుతున్న అనేక ఆరోగ్య సమస్యలకు యోగా ఒక దివ్యౌషధమని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండ లం కాన్హా శాంతివనం వేదికగా నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చే సిన కిషన్‌రెడ్డికి హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ అధిపతి, పద్మభూషణ్ గ్రహీత కమలేష్ డి. పటేల్ (దాజీ) ఘనస్వాగతం పలికారు.

అనంతరం కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్, మహబూబ్‌నగర్ ఎంపీ డి.కె. అరుణలతో కలిసి కిషన్‌రెడ్డి యోగాసనాలు వేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని జయించడానికి యోగా ఒక్కటే మార్గమన్నారు. యోగా అనేది భారతదేశం ప్రపంచా నికి అందించిన అపురూపమైన కానుక అని, దీన్ని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని కోరారు. కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా, మానసిక ఉల్లాసానికి, ఏకాగ్రత పెంపొందించుకోవడానికి యోగా ఎంతో దోహదపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమం జరిగిన కాన్హా శాంతి వనం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రంగా గుర్తింపు పొందింది.

ఇక్కడ ఒకేసారి లక్ష మంది కూర్చుని ధ్యానం చేసే సౌకర్యం ఉండటం విశేషం. యోగా దినోత్సవం (జూన్ 21) సమీపిస్తున్న తరుణంలో, ప్రజ ల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆ యుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి సన్నాహక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఆయుష్ శాఖ ఉన్నతాధి కారులు, హార్ట్‌ఫుల్‌నెస్ వాలంటీర్లు, యోగా సాధకులు పాల్గొన్నారు.