పశ్చిమ అభివృద్దె ప్రధాన లక్ష్యం
* ఎన్నో ఏళ్ల సుదీర్ఘ సమస్యలకు పరిష్కార మార్గాలు
* అభివృద్ధికి ప్రజలు సహకరించాలి
* రూ.9.37 కోట్ల పనులకు శంకుస్థాపనలు
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం 48, 49 డివిజన్ల పరిధిలో సుమారు రూ.9.37 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ కుసుర్ పాషా, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. రూ.7.50 కోట్ల వ్యయంతో ఎన్ఐటి నుంచి లోటస్ కాలనీ వరకు ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఈ రహదారి రెండు వైపులా సెంటర్ లైటింగ్ వ్యవస్థతో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 48వ డివిజన్‌లో రూ.50 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణం, రూ.1.37 కోట్లతో లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రథమ లక్ష్యమని స్పష్టం చేశారు. శంకుస్థాపనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనులు వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఎన్ఐటి రహదారి పనులు ప్రారంభం కావడంతో ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు.
అన్ని డివిజన్లలో అంతర్గత రోడ్లు, సీసీ డ్రైనేజీ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాజీపేట దర్గా పరిసర ప్రాంతాలు దీర్ఘకాలంగా అభివృద్ధికి నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ఇప్పుడు ఆ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. దర్గా రైల్వే ట్రాక్ అవతల నివసించే ప్రజల గేట్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ప్రజల్లోనే ఉంటూ ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా ప్రజా అభివృద్ధినే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేసే మాయమాటలను నమ్మకుండా, పనిచేసే వారిని గుర్తించి భవిష్యత్తులో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మానస రాంప్రసాద్, సత్రాజ్ బేగం, మాజీ కార్పొరేటర్లు అబూబకర్, ఏనుకొంటి నాగరాజు, సీనియర్ నాయకులు అమర్, కట్ట రఘుపాల్ రెడ్డి, మట్టెడ కుమార్, డివిజన్ అధ్యక్షులు సింగరపు రవి ప్రసాద్, మల్లారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.




