11 March, 2026 | 8:14 PM

మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మృతిపై సంతాపం

11-03-2026 04:42 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి మృతిపై పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ రాష్ట్ర జెడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మోహన్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు.

తూప్రాన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న షబ్బీర్ అలీ, మనోహర్ రెడ్డి మోహన్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోహన్ రెడ్డి ప్రజాసేవలో చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి,ఈ కష్ట సమయంలో అందరూ వారికి అండగా ఉంటామని తెలిపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.