మోదీ నాయకత్వంపై కాంగ్రెస్ విమర్శలు అర్థరహితం
మెదక్ ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట, జూన్ 12 (విజయక్రాంతి): దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తోందని, అలాంటి ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. శుక్రవారం సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
స్వాతంత్య్రం తర్వాత దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. నెహ్రూ కుటుంబ సభ్యుల పేర్లతోనే అనేక పథకాలు, సంస్థలకు పేర్లు పెట్టారని, ఇతర స్వాతంత్య్ర సమరయోధులకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్కు తగిన స్థానం కల్పించడంలో కూడా కాంగ్రెస్ వెనుకడుగు వేసిందని వ్యాఖ్యానించారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా ఢిల్లీ నుంచి పంపిన రూ.100లో కేవలం రూ.15 మాత్రమే లబ్ధిదారులకు చేరుతున్నాయని చెప్పారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానం ద్వారా ప్రతి రూపాయి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేలా పారదర్శక వ్యవస్థను తీసుకొచ్చిందని తెలిపారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ దేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో నాలుగో స్థానానికి తీసుకువచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
భారీ జనాభా కలిగిన భారతదేశాన్ని ఇతర దేశాలతో నేరుగా పోల్చడం సరికాదన్నారు. అమెరికా జనాభా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభాతో సమానంగా ఉంటుందని ఉదాహరణగా చెప్పారు.సామాన్య కుటుంబం నుంచి వచ్చిన, చిన్నతనంలో చాయ్ విక్రయించిన వ్యక్తి దేశ ప్రధానిగా ఎదగడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. నెహ్రూ కుటుంబం నుంచి వరుసగా ప్రధానులు కాకపోవడాన్ని కూడా కాంగ్రెస్ నాయకత్వం భరించలేకపోతోందని అన్నారు.
తెలంగాణలో రైతులకు ఫసల్ బీమా సక్రమంగా అమలు చేయలేని కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలపై మాట్లాడే నాయకులు కల్లాల వద్దకు వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తున్నారా అని ప్రశ్నించారు.మరో మూడేళ్లు కేంద్రంలో ఈ ప్రభుత్వానికే పదవీకాలం ఉందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీనే మరోసారి ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభావాన్ని తగ్గించేందుకు కమ్యూనిస్టుల భావజాలాన్ని ఆశ్రయిస్తూ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు కూడా కనిపించవని జోస్యం చెప్పారు. దాదాపు పన్నెండేళ్లుగా ప్రధానమంత్రిగా, రెండు దశాబ్దాలకు పైగా ప్రజాప్రతినిధిగా ఒక్కరోజు సెలవు తీసుకోకుండా దేశ సేవ కోసం పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించేలా తనను గెలిపించిన మెదక్ ప్రజలకు ఈ సందర్భంగా వినమ్ర కృతజ్ఞతలు తెలిపారు.






