13 June, 2026 | 12:40 AM

స్కై వాక్ లిఫ్ట్‌లో చిక్కుకున్న యువకుడు

13-06-2026 12:04 AM

రెండు గంటలపాటు నరకయాతన 

ఉప్పల్ సర్కిల్ వద్ద ఘటన

ఉప్పల్, జూన్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్ ఉప్పల్ లో సర్కిల్ వద్ద ఉన్న స్కై వాక్ లిఫ్ట్లలో ఓ యువకుడు చిక్కుకొని రెండు గంటలు నరకయాతన అనుభవించాడు. వివరాల్లోకి వెళ్లే.. ఉప్పల్‌లో శ్రీలక్ష్మి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్న రాహుల్ (20) ఎన్‌ఆర్‌పీలో ఉద్యోగం చేస్తున్నాడు.

విధులు ముగించుకొని రాత్రి సుమారు 11.30 గంటలకు హాస్టల్‌కు వెళుతున్న సమయంలో ఉప్పల్ చౌరస్తాలోని సిక్స్ బీ స్కై వాక్ లిఫ్ట్ ఎక్కి కిందికి దిగుతుండగా లిఫ్ట్ అకస్మాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది.

దీంతో రాహుల్ లిఫ్ట్ లోనే చిక్కుపోయి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. సుమారు రెండు గంటల పాటు లిఫ్ట్‌లో నరకయాతన అనుభవించారు. సమాచారం అందుకున్న హైడ్రా అధికా రులు, ఉప్పల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలం చేరుకొని సహాయక చర్యలు చేపట్టి లిఫ్ట్ తలుపులు తెచ్చేందుకు దాదాపు రెండు గంటల పైగా శ్రమించారు.

చివరికి టెక్నీషియన్ రాత్రి ఒంటి గంట సమయంలో వచ్చి లిఫ్ట్‌లో ఉన్న రాహుల్ సురక్షితంగా బయటికి తీశారు. లిఫ్ట్ నిర్వహణ చూస్తున్న కృష్ణ కన్స్ట్రక్షన్ సిబ్బంది, హెచ్‌ఎండీఏ అధికారులు సకాలంలో స్పందించకపోవడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా స్కైవాక్ దగ్గర ఉన్న లిఫ్టుల పనితీరును పరిశీలించి మరమ్మతులు చేయించాలని పలు వురు కోరుతున్నారు.