12 March, 2026 | 3:44 AM

ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ డిట్టో!

12-03-2026 01:58 AM

కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యానికి అడుగడుగునా అగౌరవమే

ఆ ఇద్దరికీ క్లీన్‌చిట్ ఇవ్వడమనేది ప్రజాతీర్పును కాలరాయడమే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీరును కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యానికి అడుగడుగునా అగౌరవం ఎదురవుతోందని, దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి పార్టీ ఫిరాయింపుదారులకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం తెలంగాణ ప్రజల తీర్పును కాలరాయడమే అన్నారు.

ఈ విషయంలో.. నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన తీరునే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని, ఈ రెండు పార్టీల ఆలోచన శైలి, వ్యవహార శైలిలో ఏమార్పూ లేదని తెలిపారు. బీఆర్‌ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి, తర్వాత ముఖ్యమంత్రి సమక్షంలో కండువా మార్చుకుని, ఏకంగా కాంగ్రెస్ బీ- ఫామ్ మీద ఎంపీగా.. తన మీద పోటీ చేసిన సాక్ష్యాలు సరిపోవా స్పీకర్ గారు? అని నిలదీశారు. సామాన్యులందరికీ కనిపించిన సాక్ష్యాలు మీకు ఎందుకు కనిపించడం లేదు? అని ప్రశ్నించారు.

ఫిరాయింపులను అరికట్టాల్సిన అత్యున్నతమైన, బాధ్యతాయుతమైన స్పీకర్ పదవిలో ఉండి, వాటికి చట్టబ ద్ధత కల్పించడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయమన్నారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారి రాజ్యాంగ వ్యవస్థలను అధికార పార్టీ చేతిలో బందీగా మార్చారని, ఇది ప్రజల తీర్పును కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేసిన తీరుకు నిదర్శనమని కిషన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పదవుల కోసం ప్రజా తీర్పును అంగట్లో సరకులాగా మారిస్తే, దానికి స్పీకర్ వత్తాసు పలకడం దురదృష్టకరమన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ గుర్తుమీద ఎన్నికైన శాసనసభ్యులు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తారు.. పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి.. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలోకి పార్టీ ఫిరాయించడం.. బీఆర్‌ఎస్ గుర్తుపై ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధి కాంగ్రెస్ గుర్తుపై పోటీచేశారన్నారు.

ఈ రెండు పార్టీలు తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాలరాయడం, ప్రజాస్వా మ్యాన్ని అపహాస్యం చేయడంలో ఒకరికొకరు పోటీపడి ప్రజాతీర్పునకు వెన్నుపోటుపొడుస్తున్నారని మండిపడ్డారు. అధికార దుర్విని యోగంతో వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చు కానీ, ప్రజల ఆగ్రహాన్ని మేనేజ్ చేయలేరని.. కళ్లముందు జరుగుతున్న ఈ అన్యాయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని, రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న వారికి ప్రజాక్షేత్రంలో తగిన శాస్తి తప్పదని ఆయన హెచ్చరించారు.