30 June, 2026 | 1:37 AM

ప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళా సంఘాలు భాగస్వాములు కావాలి

30-06-2026 12:36 AM

కలెక్టర్ కె.హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 29(విజయ క్రాంతి): ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మహిళా సంఘాలు చురుకుగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ కె. హరిత పిలుపునిచ్చారు. జిల్లా మహిళా సమాఖ్య సమావేశంలో మాట్లాడుతూ పాఠశాల యూనిఫారాల కుట్టు పనులను గడువులో పూర్తి చేయాలని, గ్రామాల్లో పారిశుధ్యం, ప్లాస్టిక్ నిర్మూలన, పాఠశాలల పర్యవేక్షణ, రక్తహీనత నివారణ, హెచ్పీవీ వ్యాక్స్పి అవగాహన కార్యక్రమాలను మహిళా సంఘాలు చేపట్టాలని సూచించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని కోరారు.

ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణికి వచ్చే ప్రజల సమస్యలను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహిం చిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారితో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. భూ వివాదాలు, పెన్షన్, బదిలీ, నష్టపరిహారం తదితర అంశాలపై వినతులు అందగా, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి

యువత నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు నెలల ఉచిత శిక్షణకు ఎంపికైన 45 మంది అభ్యర్థుల బస్సును జెండా ఊపి ప్రారంభించారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని యువతకు సూచించారు.

ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ వేగవంతం చేయాలి

 ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. జూమ్ సమావేశంలో తహసీల్దార్లు, బీఎల్వోలతో సమీక్ష నిర్వహించి, తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేయాలని సూచించారు. రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారం, టీ-ఫైబర్ పనుల పురోగతిపైనా దిశానిర్దేశం చేశారు.