రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం
నిజాంను తలపిస్తున్న రేవంత్ ప్రవర్తన
తప్పుడు ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఆస్కార్ ఇవ్వాలి
రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తాం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్ల రద్దు పేరు చెప్పి బీజేపీపై కుట్ర చేస్తుండడాన్ని అందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్‌ను నిజాం అని భావించామని, కానీ సీఎం రేవంత్ ప్రవర్తన మరో నిజాంను తలపిస్తోందని విమర్శించారు. ఆయన భాష సీఎం స్థాయికి తగినట్లు లేదని, బూతుల కోసం ప్రత్యేకంగా టీమ్‌ను పెట్టుకున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌కు బూతులు, కోతలు మాత్రమే తెలుసని, చేతలు తెలియవంటూ ఎద్దేవా చేశారు.
కేంద్రంతో ఘర్షణ తగదని నాడు బీఆర్‌ఎస్‌కు చెబితే పట్టించుకోలేదని.. నేడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను యూటీ చేస్తుందని బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం చేయడంలో కేసీఆర్ కుటుంబానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందని అధికార కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని, తాము ఏమిచ్చామనే దానిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
రైతు భరోసా నిధులు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఇవ్వాలని చెప్పామని, దానిపై తాము ఎటువంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. తాము చేస్తున్న ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి అధికార కాంగ్రెస్ పార్టీలో కలవరం, రేవంత్ ప్రసంగాల్లో అసహనం కనిపిస్తోందన్నారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా దక్షిణాది వారిపై చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని అన్నారు. రంగు ఆధారంగా తక్కువ చేసిన మాట్లాడటం సరికాదన్నారు.
ప్రధాన ఎన్నికల అధికారికి కిషన్ రెడ్డి లేఖ..
వేసవి నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి కిషన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలని, క్యూలో నిల్చునే ఓటర్ల కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని కోరారు.




