అందరి టార్గెట్ వరంగల్!
ప్రధాన పార్టీల కన్ను ఈ స్థానం పైనే
గెలుపు కోసం అభ్యర్థుల హోరాహోరీ
ప్రచారంలో ప్రధాని, ముఖ్యమంత్రులు
నేడు తొర్రూర్‌కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
వరంగల్, మే 8 (విజయక్రాంతి): వరంగల్ పార్లమెంట్ స్థానంపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. రాష్ట్రంలో రెండో రాజధానిగా పేరుగాంచిన వరంగల్ గడ్డపై తమ పార్టీ జెండాను ఎగురవేసేందుకు ప్రత్యేక వ్యూహాలు పన్నుతున్నాయి. రాజకీయంగా చైతన్యవంతమైనదే కాకుండా ఉద్యమాలకు ఊపిరులూదిన ఓరుగల్లు సీటును ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మూడు ప్రధాన పార్టీల కన్ను వరంగల్ స్థానంపై పడటంతో పోటీ రసవత్తరంగా మారుతోంది. గతంలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన కాంగ్రెస్.. మరోసారి గెలవాలని పట్టుదలతో ఉండగా తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండు ఎన్నికలలో విజయం సాధించిన బీఆర్‌ఎస్ కూడా మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాకు తోడు అన్ని హంగులున్న బలమైన అభ్యర్థిని బరిలో నిలిపిన బీజేపీ కూడా ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు తెలుస్తోంది. అయితే, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతోపాటు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం.
గెలుపు కోసం వ్యూహా ప్రతివ్యూహాలు
వరంగల్ ఎంపీ స్థానం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రత్యేక వ్యూహాలతో ప్రచారం చేస్తున్నాయి. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను బరిలో నిలిపిన బీజేపీ తమ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం, ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ కార్యకర్తలను క్షేత్రస్థాయిలో రంగంలోకి దింపింది. మండల కేంద్రాలు, పెద్ద గ్రామాలలో సభలు, కార్నర్ మీటింగ్‌లు పెడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, అమలవుతున్న పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ కూడా గ్రామాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించేలా రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను వివరిస్తోంది. ప్రత్యేక రాష్ట్రంలో రెండుసార్లు వరుసగా విజయం సాధించిన బీఆర్‌ఎస్ కూడా గ్రామ స్థాయిలో క్యాడర్‌ను సన్నద్ధం చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థిగా అనూహ్యంగా టికెట్ సాధించిన హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్‌ను గెలిపించాలని ప్రజల వద్దకు వెళ్తోంది. కరెంటు సరఫరా, నీటి సౌలభ్యం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది.
ఓరుగల్లుకు ప్రధాని, ముఖ్యమంత్రులు
వరంగల్ పార్లమెంట్ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో సైతం అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ కోసం ప్రధాని నరేంద్రమోదీ మామునూరులో జరిగిన బహిరంగసభలో పాల్గొనగా హనుమకొండలో జరిగిన రోడ్ షోలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ దామీ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే గురువారం పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరులో జరిగే సభకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో మూడుసార్లు పర్యటించారు. మడికొండ, భూపాలపల్లి నియోజకవర్గం రేగొండలో నిర్వహించిన బహిరంగసభలతోపాటు హనుమకొండ, వరంగల్‌లో జరిగిన రోడ్ షోలలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌కుమార్ గెలుపు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హనుమకొండలో రోడ్ షోలో పాల్గొన్నారు. మొత్తంగా చూసినట్లయితే వరంగల్ స్థానం గెలుచుకోవడం కోసం మూడు ప్రధాన పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలు
నియోజకవర్గం పోలింగ్‌కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
స్టేషన్‌ఘన్‌పూర్ 295 1,25,210 1,28,898 254,110
పాలకుర్తి 296 1,26,411 1,29,090 13 2,55,514
పరకాల 239 1,08,076 1,14,305 2 2,22,383
వరంగల్ వెస్ట్ 244 1, 39,322 1,44,108 16 2,83,446
వరంగల్ ఈస్ట్ 230 1,25,638 1,32,518 339 2,58,495
వర్ధన్నపేట 279 1,34,257 1,39,491 18 2,73,766
భూపాలపల్లి 317 1,36,507 1,40,238 7 2,76,752
మొత్తం 1900 9,85,421 9,28,648 397 18,24,466




