13 April, 2026 | 3:02 PM

రాజ్యాంగ రక్షణకు పాటుపడాలి

09-05-2024 01:36 AM

బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం

కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 8 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ రాజ్యాంగ రక్షణకు పూనుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ పేరిట బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయని, అసమానతలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అంబానీ, అదానీల ఆదాయాలు పెరుగుతున్నాయి తప్ప పేదల జీవితాల్లో ఏ మార్పులు రావడం లేదని అన్నారు.  రైతులు వ్యవసాయం చేసే పరిస్థితులు లేవని, పట్నంలో సెక్యూరిటీ గార్డుగా పని చేయడం నయం అనే ఆలోచనలో ఉన్నారని పేర్కొన్నారు.

నేటి తరం యువత బీజేపీ మాయలో పడి భవిష్యత్తును అంధకారం వైపు తీసుకువెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీని మరోసారి గెలిపిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ.. రాజ్యాంగ రక్షణ కోసం ఇండియా కూటమికి ఓటు వేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, టీజేఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బాబన్న, మునీర్, రవీందర్, డాక్టర్ రమేశ్, దినకర్, కార్తీక్, చిరంజీవి, సోయం చిన్నన్న, మారుతి, శ్యాం, అసద్, ఆసీఫ్, జావీద్, వసంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.