15-11-2025 02:02:29 AM
24,729 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం
-బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై గెలుపు
-రెండో రౌండ్ నుంచి ఏకపక్షంగా సాగిన కౌంటింగ్..
-డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి
-ప్రధాన పార్టీల తర్వాత నాలుగో స్థానంలో నిలిచిన నోటా.. 924 ఓట్లు సాధించి రికార్డు
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 14 (విజయక్రాంతి) : రాష్ర్ట వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, తన సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ అభ్యర్థి అయిన మాగంటి సునీతపై 24,729 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.
శుక్రవారం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు పటిష్ట భద్రత నడుమ ఓట్ల లెక్కిం పు ప్రక్రియ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత, ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి రౌండ్‌లో ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీ పోరు నడిచింది. ఆ రౌండ్‌లో కాంగ్రెస్ కు కేవలం 62 ఓట్ల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే, రెండో రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వెనుదిరిగి చూడలేదు.
ప్రతి రౌండ్‌లోనూ తన ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్లారు. ముఖ్యంగా 3, 4, 7, 8 రౌండ్లలో కాంగ్రెస్ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కొన్ని డివిజన్లలో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. కాంగ్రెస్ జోరు ముందు నిలవలేకపోయారు. మొత్తం పది రౌండ్లు ముగిసేసరికి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు పోలయ్యాయి.
దీంతో, బీఆర్‌ఎస్ అభ్యర్థిపై నవీన్ యాదవ్ 24,729 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి కేవలం 17,061 ఓట్లు మాత్రమే రావడంతో ఆ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి శాతం, బీఆర్‌ఎస్‌కు శాతం, బీజేపీకి శాతం ఓట్లు పోలయ్యాయి.
నోటాకు జై కొట్టిన ఓటర్లు..
ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ‘నోటా’. ప్రధాన పార్టీల తర్వాత, బరిలో ఉన్న మిగిలిన 55 మంది అభ్యర్థులందరి కంటే ‘నోటా’కే అధిక ఓట్లు రావడం గమనార్హం. మొత్తం 924 మంది ఓటర్లు.. అభ్యర్థులెవరూ నచ్చలేదంటూ నోటాకు తమ ఓటు వేశారు. విశేషమేమిటంటే, ఈ 924 ఓట్లలో రెండు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఉన్నాయి. అంటే, ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు అధికారులు సైతం నోటాను ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. మిగిలిన 55 మంది అభ్యర్థులలో 13 మందికి మాత్రమే మూడు అంకెల ఓట్లు రాగా, ఒకరికి ఒకే అంకె, మిగతా వారికి రెండంకెల ఓట్లు మాత్రమే పోలయ్యాయి.