17 July, 2026 | 2:06 PM

‘మానుకోట’పై కాంగ్రెస్ జెండా !

05-06-2024 01:06 AM

వరంగల్, జూన్ 4 (విజయక్రాంతి): మానుకోట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. మహబూబాబాద్ సాంఘిక సంక్షేమ కళాశాలలో మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఆది నుంచీ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. మహబూబాబాద్, పినపాక, భద్రాచలం, ములుగు, నర్సంపేట, డోర్నకల్, ఇల్లెందు అసెంబ్లీ స్థానాల పరిధిలో బలరాం నాయక్ 6,08,505 ఓట్లు రాబట్టారు. తన సమీపం బీఆర్‌ఎస్ అభ్యర్థి మాలోతు కవితపై 3,46,089 మెజార్టీతో విజయం సాధించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత 2,62,416 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ఆజ్మీర సీతారాంనాయక్ 1,08,775 ఓట్లు సాధించారు. 

రాజకీయ ప్రవేశం..

నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత 20098లో బలరాం నాయక్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. మహబూ బాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఏకంగా కేంద్ర సహాయ మంత్రి పదవి చేపట్టారు. 2014, 2019 ఎంపీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసీ ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ అది నెరవేరలేదు. ఈ ఎంపీ ఎన్నికల్లో సీటు సాధించి గెలుపొందారు.