18-09-2025 11:38:50 AM
కరీంనగర్ క్రైం, (విజయక్రాంతి): తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అబద్దాల పునాదుల మీద బతుకుతుందని కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీమ్ విమర్శించారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, ఎంతోమంది గ్రూప్స్ రాసినటువంటి విద్యార్థుల బతుకులను ఛిద్రం చేసిన బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవులు అనుభవించినప్పుడు ఇలాంటి పోరాటాలు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా అధికారంలో ఉన్నప్పుడు మొద్దు నిద్ర పోయిన కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఈరోజు కొత్త డ్రామాలకు తెరలేపుతుందన్నారు.
ఫలితాలు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చెమటోడ్చి, తమ బిడ్డలను చదివిస్తే, ఉత్తీర్ణత సాధించిన తల్లిదండ్రుల కళ్ళలో కనీసం ఐదు నిమిషాలు కూడా ఆనందం చూడకూడదని, ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలను అడ్డుకునేందుకు కుట్ర చేసి కొంతమంది కిరాయి ముకలను వారి ఉనికి చాటుకోవడానికి టీజీఎస్పీఎస్ కార్యాలయం ముట్టడి చేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. ఆరోజు బిఆర్ఎస్ ప్రభుత్వం(BRS government) గ్రూప్ వన్ పరీక్ష కావాలని రద్దు చేసినప్పుడు గ్రూప్ వన్ విద్యార్థిని అశోక్ నగర్ హాస్టల్లో మనోవేదన చెంది ఆత్మహత్య చేసుకుంటే కేటీఆర్ ప్రేమ వ్యవహారమని ముడిపెట్టినప్పుడు, మహిళా సాధికారత గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడే కల్వకుంట్ల కవిత ఆరోజు ఎందుకు పెదవి విప్పలేదన్నారు. కెసిఆర్ వదిలిన బాణమే కల్వకుంట్ల కవిత అని అందరూ గమనిస్తున్నారు ఖబర్దార్ జాగృతి అంటూ హెచ్చరించారు.