18-09-2025 10:05:36 AM
వెంకటేశ్వర కాలనీ వాసులపై మాజీ కౌన్సిలర్ ప్రతాపం..
పిడిగుద్దులతో వీరంగం.. నలుగురికి గాయాలు..
జైలుకు పంపిన పోలీసులు
మణికొండ,(విజయక్రాంతి): అధికారం పోయినా అహంకారం తగ్గలేదు. ప్రజా ప్రతినిధిగా పనిచేసిన ఆయనే ప్రజలపై ప్రతాపం చూపాడు. నెక్నాంపూర్ మాజీ కౌన్సిలర్(Former Neknampur Councilor) పద్మారావు, కాలనీ వాసులపై దాడికి తెగబడి తన దౌర్జన్యాన్ని ప్రదర్శించాడు. ఓ సాధారణ సమావేశంలో విచక్షణ కోల్పోయి పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో నలుగురు గాయపడగా, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు పద్మారావును, అతని అనుచరులను అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. నార్సింగి మున్సిపాలిటీ(Narsingi Municipality) పరిధిలోని వెంకటేశ్వరా కాలనీ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన పద్మారావు, ఓ అంశంపై కాలనీ వాసులతో వాగ్వాదానికి దిగాడు. మాటమాట పెరగడంతో ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. తన మాజీ హోదాను అడ్డుపెట్టుకుని సభ్యులపై విరుచుకుపడ్డాడు. అంతటితో ఆగకుండా, రాజ్ కుమార్ అనే యువకుడిని లక్ష్యంగా చేసుకుని పిడిగుద్దులతో దాడి చేశాడు. అడ్డుకోబోయిన మరికొందరిపైనా దాడికి పాల్పడటంతో సమావేశ ప్రాంగణం రణరంగంగా మారింది. పద్మారావు సృష్టించిన బీభత్సంలో రాజ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధితులు హుటాహుటిన నార్సింగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పద్మారావుపై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి, గురువారం ఉదయం మాజీ కౌన్సిలర్ పద్మారావుతో పాటు దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని జైలుకు తరలించారు. ఒకప్పుడు తమకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తే ఇలా ప్రవర్తించడంపై కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.