18-09-2025 12:34:01 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన మిర్యాలగూడ శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి(MLA Battula Lakshmareddy) 2 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. కుమారుడి వివాహ రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలనుకున్న డబ్బును నియోజకవర్గంలోని రైతులకు ఉపయోగపడే కార్యక్రమంగా మార్చుకోవాలని భావించి 2 కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు.
ఎంఎల్ఏ లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న, కోడలు వెన్నల, నల్గొండ లోక్‌సభ సభ్యులతో వచ్చి ముఖ్యమంత్రికి కలిసి చెక్కును అందించారు. ఆ డబ్బును మిర్యాలగూడ నియోజకవర్గంలోని(Miryalaguda Constituency) రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో దాదాపు లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో యూరియా బస్తా(Urea bag) ఉచితంగా అందజేయాలని కోరారు. లక్ష్మారెడ్డి తన కుమారుడు సాయి ప్రసన్న వివాహ రిసెప్షన్ మిర్యాలగూడలో నిర్వహించాలని భావించినప్పటికీ దాన్ని రద్దు చేసుకుని ఆ డబ్బును రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. రైతులకు ప్రయోజనం కలిగించే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని, వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి అభినందించారు.