ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యం
రైతుల కష్టాలు పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ సీఎం పర్యటనలు: మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట రూరల్, మే 12: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రైతు లు పండించిన ధాన్యం కొనుగోలు కాక కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా త్రం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు.
సోమవారం సిద్ది పేట రూరల్ మండలం బండచెర్లపల్లి ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సం దర్శించిన హరీష్ రావు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం చింతమడక గ్రామంలో రైతులు, ఉపా ధి హామీ కూలీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు మూడు వారాలుగా తమ కూలీ డబ్బులు అందలేదని హరీష్ రావు దృష్టికి తీసుకువచ్చారు. రైతులు తమ ధాన్యాన్ని బీ-గ్రేడ్ కింద నమోదు చేస్తున్నారని, దీంతో తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హరీష్ రావు మాట్లాడుతూ మొక్కజొన్న, సన్ఫ్లవర్, శనగలు విక్రయించిన రైతులకు ఇప్పటికీ చెల్లింపులు జరగలేదన్నారు. మార్కెట్లలో పంట నిల్వలు పేరుకుపోయి ఉండగా, రైతులు 40 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ధాన్యం తరలింపునకు లారీల కొరత, మిల్లుల వద్ద దిగుబడి నిలిచిపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి రైస్ మిల్లు వద్ద సివిల్ సప్లై లేదా రెవెన్యూ అధికారిని నియమించి పర్యవేక్షణ చేపట్టాలని, వర్షాలు పడేలోపు యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరారు. లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు.
మార్చి 22న సిద్దిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతుబంధు నిధులు 45 రోజుల్లో విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, 52 రోజులు గడిచినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని హరీష్ రావు విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేవని రైతులు గుర్తు చేసుకున్నారని, మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని హరీష్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి మరియు మంత్రులు రైతుల కష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.






