18-07-2025 08:26:24 PM
బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్
కొత్తపల్లి,(విజయక్రాంతి): బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంనకు జిల్లా ఉపాధ్యక్షులు పెంట శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ పెంచుతున్నామంటూ ప్రగల్బాలు పలికి చట్టసభలో 42 శాతం బీసీలకు విద్యా,ఉద్యోగ,ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు కల్పిస్తామని బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది. అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టిన విధానమే ఒక మోసపూరిత చర్య.
బీసీలను,హిందువులను అనాదికాలం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూనే వస్తుంది. బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఇప్పటివరకు ఉన్న కులాలతో పాటు అదనంగా కొత్త కులాలను చేర్చి జనాభా దామాషా పద్ధతిలో కాకుండా అశాస్త్రీయంగా బీసీలలోని వివిధ గ్రూపులను విభజించి అందులో వివిధ కులాలను చేర్చడమే కాదు బీసీలను మోసం చేసే చర్యకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త వివాదానికి తెర లేపడం చూస్తుంటే బీసీల మధ్య చిచ్చు పెట్టి ఓట్ల పబ్బం గడుపుకోవాలనే కుట్రపూరిత చర్య కనబడుతుంది .
భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో వెనుకబడిన తరగతులు అంటే ఈ దేశంలో ఉన్న వెనుకబడిన కులాలు మాత్రమే. అయితే ఎక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదు అని భారత రాజ్యాంగం ద్వారా వివిధ న్యాయస్థానాలలో తీర్పులు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచుతున్నామని చెప్తూనే బీసీ కులాలలో బీసీ ఇ పేరుతో ఒక కొత్త గ్రూపును చేర్చి దాన్లో మత ప్రాతిపదికన ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడం చూస్తుంటే గతంలో ఉన్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన శాతాలను తగ్గించడమే కాదు ముస్లిం మతానికి రిజర్వేషన్ అందించి బీసీలను మోసం చేస్తూ బీసీల జాబితాలో బిసి ఈ అనే పేరుతో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ పెంచడం మోసపూరిత చర్యగా అభివర్ణిస్తున్నాం.
ముస్లింలకు కేటాయించిన 10 శాతం బీసీ రిజర్వేషన్ తీసేస్తే బీసీలకు మిగిలింది కేవలం 32 శాతం మాత్రమే గతంలో 29% లో నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్ పేరుతో బీసీ రిజర్వేషన్ మింగి వేయడం చూసాం. దానితోపాటు అది సరిపోదు అన్నట్టుగా మళ్లీ ఇంకొక ఆరు శాతం కలిపి మొత్తం 10% బీసీఈ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇది పూర్తిగా వెనుకబడిన కులాలను,తరగతులను మోసం చేయడమే కాదు అన్యాయం చేయడం కూడా అని భావిస్తున్నాం.
కావున మత ప్రాతిపదికన రిజర్వేషన్లు పక్కకు పెట్టి జనాభా దామాషా ప్రకారం బీసీలకు దక్కాల్సిన బీసీ రిజర్వేషన్లను పెంచి వెంటనే రాష్ట్ర చట్టసభల్లోనే నిర్ణయం తీసుకోవాలని, బీసీ రిజర్వేషన్ల పెంపుతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సిన చర్య అని తెలియజేస్తూ వెంటనే ముస్లిం మత ప్రాతిపదికన కేటాయించిన బీసీఈ 10 శాతం రిజర్వేషన్ తొలగించి కేవలం బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు జనాభా దామాషా పద్ధతిలో పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం.