23 March, 2026 | 2:12 AM

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం

23-03-2026 12:35 AM

భిక్కనూర్, మార్చి22(విజయక్రాంతి): ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బి.ఆర్.ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అత్తిలి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో మండల టిఆర్‌ఎస్ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జ్పె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాల్సిన బడ్జెట్లో ముఖ్య అంశాలు పక్కనపెట్టారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో నిర్లక్ష్యం కొనసాగుతోందని పేర్కొన్నారు.రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, కొత్త పెన్షన్లు మంజూరు కాలేదని, పెన్షన్ పెంపు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలకు 20 వేల కోట్ల కేటాయింపులు, మహాలక్ష్మి పథకం కింద 2500లు, రైతు బరోసా నిధులు, నిరుద్యోగ భృతి 4000లు, విద్యార్థులకు స్కూటీలు వంటి హామీలు బడ్జెట్లో కనిపించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తగిన నిధులు కేటాయించలేదని విమర్శించారు.ఆర్టీసీ విలీనం, ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన చెల్లింపులు, అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులు, కొత్త పీఆర్సీ, పాత పెన్షన్ విధానం వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని అన్నారు.

అలాగే యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పాత విధానంలో సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డుల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు అందే మహేందర్ రెడ్డి మండల బిఆర్‌ఎస్ నాయకులు బూంరెడ్డి, వేణు, రాంచంద్రం, మల్లేష్, హన్మంత్ రెడ్డి, నీలం రెడ్డి, సాయిలు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.